ఒకవైపు కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు ప్రైవేట్ ల్యాబులకు అప్పగించేందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు చేయించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అందుకు సంబంధించిన రేటును కూడా ప్రభుత్వాలు ఫిక్స్ చేశాయి. ఇక కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ -19 పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి ఐసొలేషన్ వార్డులను రెడీ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచనలు చేసింది. కరోనా సోకిన పేషెంట్లను ప్రత్యేక వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ ను అందించగల ప్రైవేట్ ఆసుపత్రులను ముందుకు రావాలని ప్రభుత్వం సూచించింది.
ఈ మేరకు అక్కడ ప్రముఖ ఆసుపత్రులు అందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇప్పటికే బెంగళూరులో నాలుగు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సను అందిస్తూ ఉన్నారట. ఈ క్రమంలో మరిన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సను అందించడానికి రెడీ అవుతున్నాయి. ప్రత్యేక వార్డుల ఏర్పాటు, నిపుణులైన వైద్యులు.. ఈ రెండూ ప్రైవేట్ ఆసుపత్రులకు సాధ్యమయ్యేవే. కాబట్టి కోవిడ్ 19 నివారణ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు సై అంటున్నాయి. ఇప్పటికే బెంగళూరులో బోలెడన్ని పేరెన్నిగక గల ఆసుపత్రులున్నాయి.
అయితే ధరలే ఏ స్థాయిలో ఉంటాయనేది కీలకమైన అంశం. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కసరత్తు చూస్తూ ఉందట. కోవిడ్ -19 సోకిన వారి చికిత్సకు రోజువారీ ఫీజు ఎంత? స‌్థూలంగా ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేయాలనే అంశం గురించి నలుగురు మంత్రులతో కూడిన కమిటీ నిర్ధారించనుందని, ఆ మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజులు వసూలు చేస్తూ చికిత్సను అందించడానికి ప్రభుత్వం అనుమతిని ఇవ్వనుందని తెలుస్తోంది.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సను అందించడం ప్రభుత్వాలకు క్రమంగా భారంగా మారుతూ ఉంది. కర్ణాటక వంటి భారీ ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రమే దీన్ని బరువుగా ఫీలవుతున్నట్టుగా ఉంది. అందుకే వీలైనంత త్వరగా ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ బాధ్యతలు అప్పగించేసి.. ఇక ప్రైవేట్ ఆసుపత్రులూ-ప్రజలే తేల్చుకునే పరిస్థితి తీసుకురావాలని అక్కడి యడియూరప్ప ప్రభుత్వం ఫిక్సయినట్టుంది.