ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 1400 దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 71 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు నిర్థారించారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 6497 శాంపిల్స్ ను పరీక్షించగా.. వాటిలో 71 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేల్చారు.
తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులోనే 43 పాజిటివ్స్ ఉన్నాయి. అటు కృష్ణాలో 10, గుంటూరు-కడపలో చెరో 4, అనంతపురం-చిత్తూరులో చెరో 3, ఈస్ట్-నెల్లూరులో చెరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరినట్టయింది.
తాజా ఫలితాలు కూడా కలుపుకొని చూస్తే.. కర్నూరులో అత్యథిక కరోనా బాధితులున్నారు. ఆ జిల్లాలో బాధితుల సంఖ్య 386కు చేరుకుంది. అటు గుంటూరులో 287, కృష్ణాలో 246 కేసులు ఉన్నాయి. నెల్లూరు (84), చిత్తూరు (80)లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
గడిచిన 3 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టంచేశారు. అటు డిశ్చార్జ్ ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 287 నుంచి 321కు పెరిగింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 94,558 శాంపిల్స్ ను అధికారులు పరీక్షించారు. రోజుకు కనీసం 6 వేల శాంపిల్స్ కు తగ్గకుండా పరీక్షిస్తున్నాయి. ఇకపై రోజువారీ టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామని, మరీ ముఖ్యంగా రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.