పవన్ కల్యాణ్ గత కొన్నాళ్లుగా అతిగా అవేశ పడుతూ ఉండటం వెనుక కథేమిటో ఇప్పుడు బయటపడుతూ ఉన్నట్టుంది. ఉన్నట్టుండి తన సభలకు లక్షలాది మంది వస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకుంటున్నారు. ఆరు నెలల కిందట ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి కనీసం ఒక్క చోట నెగ్గలేకపోయిన, రాష్ట్రమంతా కలిసి ఒక్క నియోజకవర్గంలో మాత్రమే నెగ్గిన పార్టీకి అధ్యక్షుడు అయిన పవన్ కల్యాణ్.. ఇలా తన సభలకు వచ్చే వాళ్ల గురించి నంబర్లు చెప్పడం కామెడీగా ఉంది. అయితే తను కామెడీ చేస్తున్నట్టుగా ఏ కమేడియన్ కూ అనిపించదు, అనిపించకూడదు! అప్పుడే ప్రేక్షకులు నవ్వుకోగలరు. పవన్ కల్యాణ్ తీరు కూడా అలానే కనిపిస్తూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. జనసేన కూడా ప్రజారాజ్యం బాటలోనే పడుతూ ఉంది. చిరంజీవి కనీసం ఎమ్మెల్యేగా నెగ్గగలిగారు. పవన్ కల్యాణ్ కు ఆ ముచ్చట కూడా తీరలేదు. దీంతో ఈయన ఎక్కడలేని అసహనాన్ని చూపుతూ ఉన్నాడు. పూటకో మాట మాట్లాడుతూ.. తన అక్కసు వెల్లగక్కుతున్నాడు.
ఈ డ్రామా అంతా విలీనం దిశగా సాగుతూ ఉండటం గమనార్హం. జనసేన విలీన ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్టుగా బీజేపీ నేతలు ప్రకటించారు. నిన్ననే పవన్ కల్యాణ్ హిందుత్వ నేతలను తిట్టారు. మత కలహాలు హిందూ రాజకీయ నేతల వల్లనే పవన్ తేల్చాడు! ఆ మాటలు బీజేపీ వాళ్లనే తగులుతాయి సహజంగా. దానికి రియాక్ట్ అయ్యింది కూడా వాళ్లే!
రెండో రోజే అమిత్ షాను పవన్ కల్యాణ్ పొగిడేశాడు. ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి పవన్ ఆడుతున్న డ్రామానా అనే సందేహాలు లేకపోలేదు. అయితే అమిత్ షాను పొగడటంతో జనసేన విలీనమే తరువాయి అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటికి అనుగుణంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విలీనం ప్రతిపాదనతో వస్తే తాము ఓకే చెబుతామని ఆయన ప్రకటించారు.
ఇక ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 'విలీనంపై ఇప్పుడేం చెప్పలేం..' అన్నారట తిరుపతి. ఓవరాల్ గా విలీన ఊహాగానాలను పవన్ కల్యాణ్ ఖండించలేదు. దీంతో అతి త్వరలోనే జనసేన తెరమరుగు అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
చిరంజీవి కనీం తను గెలిచి, తనతో పాటు పద్దెనిమిది మందిని గెలిపించుకుని వెళ్లాడు.. కాబట్టి ఆయన కనీసం రాజ్యసభ సీటు ధర అయినా పలికారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్ ధర ఏమిటనేది ప్రస్తుతానికి కొశ్చన్ మార్క్!