ఆర్టీసీ భవితవ్యం మరోసారి గాల్లో దీపంగా మారింది. చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఆర్టీ సమస్య కొలిక్కి రావడంలేదు. దీనిపై ఈరోజు హైకోర్టు కూడా అసహనం వ్యక్తంచేసింది. ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా మారండి అనే విధంగా పరోక్షంగా హెచ్చరికలు జారీచేసింది ఉన్నత న్యాయస్థానం.
కోర్టు ఆదేశాల ప్రకారం… ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, బకాయిలు, రాయితీలకు సంబంధించి కోర్టుకు ఈరోజు నివేదిక సమర్పించాలి. ప్రభుత్వం అదే పనిచేసింది. కానీ అదంతా తప్పులతడకల వ్యవహారంగా ఉందనే విషయాన్ని కోర్టు పసిగట్టింది. మరీ ముఖ్యంగా రాయితీల కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని, బస్సుల కొనుగోలు కింద చూపించడాన్ని కోర్టు ఆక్షేపించింది. బస్సుల కోసం రుణం ఇచ్చి, దాన్ని రాయితీ కింద ఎలా చూపిస్తారని ప్రశ్నించింది. రాయితీల బకాయిల్ని డీజిల్, జీతాల చెల్లింపుల కోసం వాడామని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ కోర్టుకు విన్నవించారు. కానీ ఆ విషయం నివేదికలో కనిపించలేదు.
ఇలా చెప్పుకుంటూపోతే నివేదికలో చాలా అవకతవకలున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి చెల్లించాల్సిన రాయితీ సొమ్ము 644 కోట్లను విడుదల చేసినట్టు నివేదికలో చెప్పారు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం ఆ అంశాన్ని తప్పుబట్టాయి. రకరకాల లెక్కలు చూపించి, రాయితీలు ఇచ్చామంటే ఎలా అని ప్రశ్నించాయి. మరోవైపు జీహెచ్ఎంసీ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. నిబంధనల ప్రకారం, హైదరాబాద్ లో బస్సులు తిప్పుతున్నందుకు జీహెచ్ఎంసీ కొంత మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించాలి. అలా చెల్లించాల్సిన బకాయిలు 1786 కోట్ల రూపాయల మేర ఉన్నాయి.
కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కేవలం 336 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని కూడా నివేదికలో పొందుపరిచింది ప్రభుత్వం. ఈ అంశాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ లాభాల్లో ఉందనే విషయం అందరికీ తెలుసని, అలాంటప్పుడు అప్పులు క్లియర్ చేయొచ్చుకదా అని ప్రశ్నించింది. సరైన లెక్కలతో మరో 5 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి వాదనలను గురువారానికి వాయిదావేసింది.
హైకోర్టులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ సమస్య యథాతథంగా కొనసాగుతోంది. ఈరోజు కూడా వివిధ ప్రాంతాల్లో సమ్మెలు కొనసాగాయి. కోర్టులో ప్రభుత్వానికి మరోసారి అక్షింతలు పడడం, ఇచ్చిన నివేదికలో తప్పుల్ని కోర్టు ఎత్తిచూపడంతో.. రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.