హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణానికి అని తెలంగాణ ప్రాంత దర్శకుడు ఎన్.శంకర్ కు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుపై ఆ రాష్ట్ర హై కోర్టు అభ్యంతరం తెలిపింది. శంకర్ కు ఖరీదైన భూమిని కేటాయించారని అంటూ ఒక పిటిషన్ చాన్నాళ్ల కిందే పడింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు.. ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో మళ్లీ సినిమా స్టూడియో నిర్మించాల్సిన ఉందా? అన్నట్టుగా ప్రశ్నించిందట కోర్టు.
అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని, అలాంటప్పుడు ఇతర వ్యక్తులకు మళ్లీ భూములు కేటాయించాల్సిన అవసరం ఏమిటని హై కోర్టు ప్రశ్నించినట్టుగా సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో శంకర్ కూడా పోరాడారు అని, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారట. అయితే తెలంగాణ కోసం చాలా మంది పోరాడారని, వారందరికీ భూములిస్తారా? అని కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం సహేతుకంగా లేదని కోర్టు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని కూడా హై కోర్టు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
అయితే ఈ విషయంలో మరోసారి కౌంటర్ దాఖలు చేయడానికి ఏజీ గడువు కోరినట్టుగా తెలుస్తోంది. అందుకు రెండు వారాల గడువు కోరగా, న్యాయస్థానం సమ్మతించినట్టుగా తెలుస్తోంది.