ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచంలోనే ప్రస్తుతం ఇండియాలో అంత తీవ్రంగా కరోనా మరక్కెడా వ్యాపించడం లేదు. అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదు అయిన దేశంగా ఇండియా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం రోజువారీగా అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కన్నా ఇండియాలో రికార్డవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. నంబర్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది.
అయితే ఇదే సమయంలో కర్ణాటక సర్కారు ఒక ఆసక్తిదాయకమైన నిర్ణయంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి బెంగళూరులోని అతి పెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ను మూసేయనున్నారట. బెంగళూరు ఎగ్జిబిషన్ సెంటర్ ను కొన్నాళ్ల కిందట కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చింది ప్రభుత్వం. సాధారణంగా అక్కడ ఇంటర్నేషనల్ లెవల్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని పది వేల బెడ్స్ తో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు.
స్వల్ప, కొద్దిమేర లక్షణాలతో ఇబ్బంది పడుతున్న కోవిడ్-19 పేషెంట్లను అక్కడ ఉంచి ట్రీట్ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం అందులో పేషెంట్ల సంఖ్య చాలా తగ్గిపోయిందట. ఈ నేపథ్యంలో ఆ సెంటర్ ను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. వారం రోజుల్లో ఆ కోవిడ్ కేర్ సెంటర్ మూతపడనుందని సమాచారం.
ప్రస్తుతం బెంగళూరులో రోజువారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనాను జనాలు చూసే ధోరణిలో మార్పు వచ్చినట్టుగా ఉంది. మొదట్లో కాస్త సింప్టమ్స్ కనపడగానే మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ లు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లడానికి వాళ్లు సిద్ధపడ్డారు. అయితే ప్రస్తుతం ఆ ధోరణిలో మార్పు వచ్చినట్టుగా ఉంది. నెల రోజుల కిందటితో పోల్చినా ప్రస్తుతం రోజు వారీగా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కోవిడ్ కేర్ సెంటర్లు మూతకు రెడీ అవుతున్నాయి! ఇదీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో జనబాహుల్యంలో ప్రధానంగా కనిపిస్తున్న మార్పు.