కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ఏర్పడిన ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో రాష్ట్రాంతర ప్రయాణాలు సులభం అయ్యాయి. సెకెండ్ వేవ్ బలీయంగా ఉన్న సమయంలో ఒక రాష్ట్రం నుంచి ప్రజలను మరో రాష్ట్రంలోకి తేలికగా అనుమతించలేదు. ఆఖరికి అంబులెన్స్ లను కూడా ఆపేశారు. చివరకు కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్రాంతర ప్రయాణాలు సులభం అయ్యాయి. సరిహద్దుల వద్ద ఆంక్షలను అమలు చేసేందుకు పోలీసులెవరూ ఉండటం లేదు.
మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మాల్స్ ను తెరుచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. పెద్ద పెద్ద మాల్స్ దాదాపు మూడు నెలల తర్వాత తెరుచుకున్నాయి. మూడు నెలల పాటు మూత పడటంతో మాల్స్ లోని షాపుల యాజమాన్యాలు తీవ్రంగానే నష్టపోయాయి. లీజుల పద్ధతిన షాప్ స్థలాలను పొంది ఉంటారు చాలా మంది. అలాంటి వారికి తీవ్ర ఆర్థిక నష్టం తప్పకపోయి ఉండవచ్చు.
పెద్ద పెద్ద మాల్స్ లో అద్దెల రేట్లు పతాక స్థాయిలో ఉంటాయి. అది కూడా లీజుల పద్ధతిన షాపులు నడిపే వారికి మూసి వేసిన కాలమంతా అన్ని రకాల నష్టమూ కలిగి ఉంటుంది. అయితే ఎట్టకేలకూ తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఇప్పుడప్పుడే ప్రజలు ధైర్యంగా మాల్స్ లో అడుగుపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు.
ప్రజలు కాస్త భరోసాతో మాల్స్ కు షాపింగ్ కు రావాలంటూ కనీసం రెండు నెలల సమయం అయినా పట్టవచ్చు. అయితే అంత వరకూ మళ్లీ మాల్స్ మూతపడకుండా ఉంటాయా? అనేది కూడా ప్రశ్నార్థకమే. మళ్లీ థర్డ్ వేవ్ అంటున్నారు, అదే గనుక జరిగితే మళ్లీ ముందుగా మూతపడేది మాల్సే. అలాగే థియేటర్లకు కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక అనుమతులు ఇచ్చారు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వబోతున్నారు. రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ఢిల్లీలో అయితే తెల్లవార్లూ బార్ అండ్ రెస్టారెంట్లను తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిందట. రేపోమాపో మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి రావొచ్చు.
స్థూలంగా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అమల్లో పెట్టిన వివిధ రకాల ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉన్నాయి. ఇదైతే మంచిదే. అయితే.. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు స్టడీగా కొనసాగుతూ ఉన్నాయి కొన్నాళ్ల నుంచి. కొన్ని రాష్ట్రాల్లో అయితే యాక్టివ్ కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కూడా కనిపిస్తూ ఉంది!
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. డైలీ కేసులు గత నెల రోజులుగా అక్కడ యథాతథంగా కొనసాగుతున్నాయి. డిశ్చార్జుల కన్నా ఒక్కో రోజు కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గతవారంలో ఇలా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దీన్నెలా చూడాలో అంతుబట్టం లేదు.
సెకెండ్ వేవ్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క్షీణిస్తోందని స్పష్టం అవుతోంది. అయితే కేరళ, మహారాష్ట్రల్లో మాత్రం మళ్లీ కాస్త పెరుగుదల నమోదవుతోంది. ప్రత్యేకించి ఈ రాష్ట్రాల విషయంలోనే ఆందోళన ఎందుకంటే.. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లలో కరోనా కేసులు బాగా ఎక్కువగా వచ్చిన రాష్ట్రాలివే. కొత్త తరమా వేరియంట్లు ముందుగా బయటపడుతున్న రాష్ట్రాలు ఇవే. సెకెండ్ వేవ్ ముందుగా మహారాష్ట్రలోనే పతాక స్థాయికి చేరింది. ఆ తర్వాతే దేశమంతా అల్లుకుంది.
కాబట్టి.. మహారాష్ట్రపై అయితే ప్రత్యేకించి ఒక కన్ను వేయాల్సి ఉంది దేశమంతా. అలాంటి రాష్ట్రంలో కేసుల సంఖ్య స్టడీగా సాగుతూ ఉండటం, కేరళలో అయితే మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడం.. కొత్త అనుమానాలకు తెరలేపుతూ ఉంది. మూడో వేవ్ మరెంతో దూరంలో లేదేమో అనే అంచనాలకు మహారాష్ట్ర, కేరళ పరిణామాలు కారణం అవుతున్నాయి. ఒకవైపు ఆంక్షలు తొలగుతున్నాయన్న ఆనందం కన్నా, ఇలా పెరుగుతున్న భయాలే ఆందోళన రేపుతున్నాయి.