టీటీడీలో పని చేస్తున్న 15 వేల మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సీపీఎం ఏం చేయదల్చుకున్నదో అర్థం కావడం లేదు. టీటీడీలో పని చేస్తున్న 15 వేల మందికి పైగా కార్మికులు వేర్వేరు డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు. వీరిలో కొందరు తమను కార్పొరేషన్‌లో కలపకూడదని, టైం స్కేల్ ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు.
మరోవైపు తమను సొసైటీల్లో చేర్చుకోవాలనే డిమాండ్‌తో ఎఫ్ఎంఎస్ (ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) కార్మికులు ఉద్యమ బాట పట్టారు. వీరికి సీపీఎం అనుబంధ కార్మిక సంఘం నేతృత్వం వహిస్తోంది. కార్మికుల హక్కులను సాధించుకునేందుకు వారికి మద్దతుగా నిలిచి పోరాటం చేయడాన్ని అభినందించాల్సిందే. అయితే మద్దతుతో పేరుతో తమ రాజకీయ ప్రయోజనాలకు టీటీడీ కార్మికులను వాడుకునేందుకు సీపీఎం ప్రయత్నిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
మరోవైపు సీపీఎం స్వార్థపూరిత ఆలోచన టీటీడీ కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. అమరావతి రైతులకు మద్దతు తెలపాలని టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులపై సీపీఎం అనుబంధ కార్మిక నాయకత్వం తీవ్ర ఒత్తిడి చేస్తోంది.
ఇది టీటీడీ కార్మికులకు అసలు నచ్చడం లేదు. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం, దానికి వ్యతిరేకంగా తమను ఉసిగొల్పడం ఏంటనే నిలదీతలు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల నుంచి వస్తున్నాయి.
తమ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు నమ్మకంగా ఉంటూనే, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చిత్రీకరణ చేయడం సబబా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి కోసం టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల గొంతు సీపీఎం కోస్తుందా? అనే ఆవేదన వాళ్ల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. అమరావతి రైతుల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తమకేం సంబంధమని టీటీడీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.