ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును ప్రత్యర్థులు ఆడుకుంటున్నారు. సోము వీర్రాజు ప్రత్యర్థులపై విమర్శలు సంధించే క్రమంలో కంట్రోల్ తప్పుతున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు భూమ్రాంగ్ అవుతున్నాయి. అడుసు తొక్కి, ఆ తర్వాత కడుక్కోవడం సోము వీర్రాజుకు అలవాటుగా మారింది. సోము వీర్రాజుపై ఎప్పుడెప్పుడా అని పొంచుకుని ఉన్న ప్రత్యర్థులకు తాజాగా ఆయనే ఓ అవకాశాన్ని ఇచ్చారు.
కడప జిల్లా వాసులను హత్యలు చేసుకునే వాళ్లగా చిత్రీకరించడంపై రాయలసీమ సమాజం భగ్గుమంటోంది. సీమలోని ప్రజాసంఘాలు, ఆ ప్రాంత ఉద్యమకారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు వీర్రాజు వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీర్రాజుపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కడప జిల్లా ప్రజలను ఖూనీకోర్లుగా చిత్రీకరించడం తగదని హితవు చెప్పారు. సోము వీర్రాజుకు మతిభ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆరేడు దశాబ్దాల క్రితమే కడపలో ఎయిర్పోర్ట్ ఉందన్న విషయం వీర్రాజుకు తెలియనట్టుందన్నారు.
అనుచిత వ్యాఖ్యలు, మత రాజకీయాలతో ఏపీలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. సోము వీర్రాజు ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలని రామకృష్ణ హెచ్చరించారు. సోము వీర్రాజుకు ఆయన నోరే శత్రువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను ఏం మాట్లాడాలనే అంశంపై ముందస్తు కసరత్తు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఇలాగైతే వీర్రాజుకు త్వరలోనే అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని పార్టీలోని ఆయన వ్యతిరేకులు సంబరపడుతున్నారు.