కరోనా వైరస్ ఇప్పుడప్పుడే మానవాళిని వదిలి అంతరించిపోయే అవకాశాలు లేవని అంటోంది డబ్ల్యూహెచ్వో. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉంది. వ్యాపించే తీవ్రత తగ్గినా కేసుల సంఖ్య అయితే కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పందించింది.
ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ర్యాన్ స్పందిస్తూ.. కరోనా వైరస్ సమీప కాలంలో అంతరించే అవకాశాలు లేవన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గినప్పటికి అది మనుషుల మధ్యన వ్యాపిస్తూనే ఉంటుందని ఆయన అంటున్నారు.
అందుకు ఉదాహరణగా స్వైన్ ఫ్లూను ఉదాహరించారు. స్వైన్ ఫ్లూ ప్యాండమిక్ 2009 సమయంలో తీవ్ర రూపం దాల్చిందని, లక్షల మంది మరణానికి కారణమైందని, ఇప్పుడు కూడా స్వైన్ ఫ్లూ కేసులు వస్తుంటాయనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. స్వైన్ ఫ్లూ కొనసాగుతున్న తరహాలోనే.. కరోనా కూడా భవిష్యత్తులో కొనసాగవచ్చని అయన అంచనాల గురించి వివరించారు.
కరోనా మనుషుల మధ్యన వ్యాపిస్తున్నా.. దాని తీవ్రత తగ్గవచ్చని, అలాగే హస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోవచ్చని ఆయన అన్నారు. కరోనా కారణంగా ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య క్రమంగా తగ్గినా, వ్యాప్తి కొనసాగుతూ ఉండవచ్చన్నారు.
కరోనా ను ఎదుర్కొన వ్యాధి నిరోధకత పెంచుకోవడమే పరిష్కారమన్నారు. ఈ విషయంలో వ్యాక్సిన్లు పని చేస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీ పెంపొందుతుందని అన్నారు. ఇలా మనుషులందరికీ కరోనాను ఎదుర్కొన ఇమ్యూనిటీ పెరిగినా, వైరస్ మాత్రం ఉంటుందని, మనుషులపై దాని ప్రభావం తగ్గిపోతుందనే అంచనాలను ఈ పరిశోధకులు తెలిపారు.
ఇది వరకూ కూడా పలువురు అధ్యయనకర్తలు ఈ తరహాలోనే చెప్పారు. మరి కొన్నేళ్ల పాటు కరోనా వ్యాప్తి కొనసాగుతుందని, చివరకు ఇదొక జలుబు తరహాలో మిగిలిపోవచ్చని కొన్ని అధ్యయనాలు అంచనా వేశాయి. మనిషిపై ప్రభావం చూపించేందుకు ఈ వైరస్ కు శక్తి అయితే తగ్గొచ్చని, వ్యాప్తి మాత్రం ఆగదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.