హైకోర్టు ఆగ్రహం.. దిగొచ్చిన తెలంగాణ సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ మీరు పెడతారా.. లేక మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన గంటల వ్యవథిలోనే సర్కారు కదిలొచ్చింది.…

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ మీరు పెడతారా.. లేక మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన గంటల వ్యవథిలోనే సర్కారు కదిలొచ్చింది. తెలంగాణలో కర్ఫ్యూ విధించింది.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 30వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. 

ఈ మేరకు ఆఫీసులు, షాపులు, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశాలు జారీచేసింది. హాస్పిటల్స్, మెడికల్ షాపులు, ఫార్మా ల్యాబ్స్ కు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. వీటితో పాటు పెట్రోల్ బంకులు, ఈ-కామర్స్ డెలివరీలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు ఇచ్చారు. 

రాత్రి 9 తర్వాత కూడా ఇవి పనిచేస్తాయి. ఈ సందర్భంగా సరకు రవాణాపై కూడా స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. అంతర్రాష్ట్ర రవాణాతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి జరిగే సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఎలాంటి ప్రత్యేక పాసులు, అనుమతులు అవసరం లేదని స్పష్టంచేసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ/లాక్ డౌన్ అమల్లో ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తెలంగాణ కూడా చేరింది.