ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పప్పులుడకలేదు. సెన్సూర్ అస్త్రంతో అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి, తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న పొలిటికల్ గేమ్‌లో నిమ్మగడ్డపై రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధించినట్టైంది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అడుగడుగునా ఘర్షణపూరితంగా, సహాయ నిరాకరణ ధోరణితో వ్యవహరించారనే కారణంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ను సెన్సూర్ (అభిశంసన) చేస్తూ గత నెల 26న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో పాటు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీఓపీటీ) కార్యదర్శికి సిఫార్సు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
ఇదే సందర్భంలో సెన్సూర్ వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితుల గురించి ఎల్లో మీడియా ద్వారా ఓ పథకం ప్రకారం అధికారు లను భయభ్రాంతులకు గురయ్యేలా కథనాలు రాయించారనే ఆరోపణలు లేకపోలేదు.
సెన్సూర్ అనేది చూడ్డానికి చిన్న పనిష్మెంట్ అనిపించొచ్చని, కానీ ఐఏఎస్‌ల విషయంలో పెద్ద ప్రభావమే చూపుతుందని పరోక్షంగా అధికారులకు తన అనకూల మీడియా ద్వారా హెచ్చరించారు. సెన్సూర్ వల్ల ఆరు నెలల నుంచి ఏడాది పాటు పదోన్నతులు పొందలేరని, ఇతర కీలక పదోన్నతులు, పోస్టింగ్‌లు పొందే సమయంలో దీన్ని పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యంగా ఐఏఎస్ అధికారులను భయపెట్టి లొంగతీసుకునే ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి.
సాధారణంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఇచ్చే పనిష్మెంట్లను కోర్టులో సవాల్ చేసుకోవచ్చని, కానీ అఖిలభారత సర్వీస్ అధికారుల విషయంలో అది సాధ్యం కాదంటూ కథనాలు గుప్పించారు. ఎస్ఈసీ వంటి రాజ్యాంగ సంస్థ ఇచ్చిన పనిష్మెంట్ ప్రభావం సర్వీస్ అంతా ఉంటుందని భయపెట్టే కథనాలు వండివార్చారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తొలగించాలని అనుకున్నా తేలిక్కాదని, మళ్లీ డీవోపీటీకి వెళ్లాలని, అక్కడ అన్నీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని ఏవేవో రాశారు. ఎస్ఈసీ ఇచ్చిన పనిష్మెంట్ను తొలగించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవని చివరి అస్త్రంగా ఉద్యోగులపై సంధించారు.
కానీ ఇవేవీ జగన్ ప్రభుత్వం ముందు ఇలాంటి పాచికలేవీ పారలేదు. అసలు ఐఏఎస్ అధికారులను సెన్సూర్ చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేదని తెలియజేస్తూ గత నెల 27న నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖలో తేల్చి చెప్పారు.
అంతేకాదు, నిమ్మగడ్డ పంపిన సెన్సూర్ పనిష్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో సెన్సూర్ సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీఓపీటీ) కార్యదర్శికి నిమ్మగడ్డ రమేశ్ గత నెల 27న రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
దీన్ని ఆయన వారం తర్వాత బయటపెట్టడం గమనార్హం. మొదటి దశ పోలింగ్ ప్రక్రియ మొదలైన సందర్భంలో ఉన్నతాధికారులతో పాటు తద్వారా కింది స్థాయి అధికారులను భయపెట్టేందుకే, లేని అధికారాలను తెచ్చుకుని పనిష్మెంట్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మొదటి విడత పంచాయతీ పోరులో ఎస్ఈసీపై రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించినట్టైంది. దీంతో నిమ్మగడ్డ పరువు అభిశంసనలో కొట్టుకుపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.