దమ్ము, ధైర్యం తమ సొంతమంటూ ఎగిరెగిరి పడే ఎల్లో మీడియా ఎందుకనో యూట్యూబ్‌లో తన చానల్ డిబేట్ వీడియోను తొలగించింది. ఇప్పుడిది చర్చనీయాంశమైంది. పదేపదే తన దమ్ము, ధైర్యం గురించి దుమ్ము లేచి పోయేలా రంకెలేసే సదరు చానల్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులను ఎత్తివేస్తూ కిందికోర్టులు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇవ్వడం, వాటిపై హైకోర్టు పరిపాలనపరమైన అధికారం ద్వారా సుమోటోగా విచారణ జరపడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయానికి సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పలు విలువైన అంశాలను తెరపైకి తెచ్చారు.
మరోసారి న్యాయవ్యవస్థ గురించి చర్చించుకునే అంశాలు కావడం గమనార్హం. ముఖ్యంగా ఏజీ లేవనెత్తిన అంశాల్లో ప్రభుత్వానికి కూడా అందని, తెలియని కేసు వివరాలు ఓ పత్రిక, చానల్‌కు మాత్రమే ఎలా అందాయని గట్టిగా నిలదీశారు. సుమోటో విచారణకు దారి తీసిన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను హైకోర్టు తమకు (ప్రభుత్వానికి) ఇవ్వనేలేదన్నారు.
అలాంటిది అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గురించి ఓ పత్రికలో మాత్రం అన్ని వివరాలు ప్రచురితం కావడంపై ఆయన ఆశ్చర్యం, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పత్రిక అనుబంధ చానల్ ఏకంగా 45 నిమిషాల పాటు చర్చా కార్యక్రమమే నిర్వహించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా మరోసారి రకరకాల ప్రశ్నలకు, అనుమానాలకు బీజం పడింది.
పైగా మేజిస్ట్రేట్లపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చర్యలకు సిద్ధమైందని ఆ పత్రిక రాసిందని గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆ పత్రిక, టీవీ ఛానెల్ వద్ద అన్నీ వివరాలు ఉన్నట్లున్నాయని చెప్పడం ద్వారా ఆయన ప్రజాకోర్టులో ఎవరినో బోనులో నిలబెట్టిన భావన కలిగిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు చానల్ నిర్వహించిన డిబేట్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దీంతో నెటిజన్లకు చేతినిండా పని దొరికినట్టైంది.
యూట్యూబ్‌లో డిబేట్ వీడియోను తొలగించావు సరే, మరి పేపర్‌ను ఏం చేద్దాం? అనే నిలదీతలు పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి వస్తున్నాయి. జన్మజన్మల మీ అనుబంధం దాచేస్తే దాగదులే అనే వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నారు. అంటే అన్నారని ఏడుస్తారు కానీ, మరి ఎల్లో మీడియాకు కాకి ఎత్తుకెళ్లి ఆ వివరాలన్నీ ఇచ్చిందా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం. మొత్తానికి ఎల్లో మీడియా అత్యుత్సాహం రాజ్యాంగ వ్యవస్థలకు ఇబ్బందిగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.