క‌రోనా కేసులు పెరుగుతున్న హాస్పిట‌ల్స్ లో చేరిక‌ల్లేవు!

దేశంలో క‌రోనాతో బాగా ఇబ్బంది ప‌డిన‌, ప‌డుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ముఖ్య‌మైన‌ది. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఢిల్లీలో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. మ‌రోవైపు నాలుగైదు రోజుల్లోనే ఢిల్లీలో క‌రోనా…

దేశంలో క‌రోనాతో బాగా ఇబ్బంది ప‌డిన‌, ప‌డుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ముఖ్య‌మైన‌ది. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఢిల్లీలో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. మ‌రోవైపు నాలుగైదు రోజుల్లోనే ఢిల్లీలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది కూడా. ఇలాంటి నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. క‌రోనా కేసులు పెరుగుతున్నా, భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప‌రిస్థితి నియంత్ర‌ణ‌లో ఉంద‌న్నారు. అంతే కాదు.. ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన గ‌ణాంకాల‌ను కూడా కేజ్రీవాల్ బ‌య‌ట‌పెట్టారు.

అవేమిటంటే…. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 29న ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండువేల స్థాయిలో ఉన్నాయి. అయితే జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నాటికే ఈ యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేల స్థాయికి చేరింది. ఇలా చాలా వేగంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే డిసెంబ‌ర్ 29 నాటికి ఢిల్లీలో హాస్పిట‌ల్స్ లో ఉన్న క‌రోనా రోగుల సంఖ్య 262 ఉండ‌గా, ప్ర‌స్తుతం ఆ సంఖ్య 247 అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగినా, హాస్పిట‌ల్స్ లో చేరే వాళ్ల సంఖ్య మాత్రం ఈ త‌ర‌హాలో పెర‌గ‌డం లేద‌ని కేజ్రీవాల్ ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. ఇది ఆస‌క్తిదాయ‌క‌మైన గ‌ణాంక‌మే. అయితే, ఇది ప‌రిమిత‌మైన ప‌రిశీల‌నే అనుకోవాలి. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోవ‌చ్చు. రానున్న వారం వ్య‌వ‌ధిలో.. ఈ థ‌ర్డ్ వేవ్ లో హాస్పిట‌లైజ్ అయ్యే వారి విష‌యంలో మ‌రింత స్ప‌ష్ట‌త రావొచ్చు. 

అలాగే కేజ్రీవాల్ మ‌రో అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. గ‌త ఏడాది మార్చి నెల‌లో 6,600 యాక్టివ్ కేసులు ఉన్న‌ప్పుడు, దాదాపు 1100 కు పైనే ఆక్సిజ‌న్ బెడ్ లు ఫిల‌ప్ అయ్యాయ‌ట‌. అలాగే మ‌రో 140 మందికి పైగా  వెంటిలేట‌ర్ల మీద ఉన్నార‌ట‌. 

ఆరు వేల స్థాయి కేసులు ఉన్న‌ప్పుడే.. అప్పుడు అంత మంది ఆక్సిజ‌న్ స‌పోర్ట్ మీద‌, వెంటిలేట‌ర్ స‌పోర్ట్ మీద చికిత్స పొందే ప‌రిస్థితి. అయితే ఇప్పుడు అదే స్థాయిలో కేసులున్నా.. హాస్పిట‌ల్ ను ఆశ్ర‌యిస్తున్న వారి సంఖ్య అత్యంత ప‌రిమితంగా ఉంద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి వివ‌రించారు.  

ఇదైతే సానుకూల ప‌రిణామ‌మే. ఒమిక్రాన్ వేరియెంట్ ప్ర‌భావం త‌క్కువ‌ని, ల‌క్ష‌ణాలే త‌క్కువ‌ని,  హాస్పిట‌లైజ్ అయ్యే అవ‌కాశాలు మ‌రింత ప‌రిమితం అని.. వివిధ అధ్య‌య‌నాలు, ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. వాటికి ఊతం ఇచ్చేలా ఉన్నాయి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌స్తావించిన గ‌ణాంకాలు. అయితే ఇదే ఫైన‌ల్ అని తేల్చేయ‌లేక‌పోవ‌చ్చు. రానున్న వారం, ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలో థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం పై మ‌రింత స్ప‌ష్ట‌త రావొచ్చు.