మొన్నటి వరకూ అపర చాణుక్యులుగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకున్న బీజేపీ వాళ్లు ఇప్పుడు రాజకీయంగా తాము మోసపోయామని అంటున్నారు. తమను శరద్ పవార్ మోసం చేశారని వారు వాపోతున్నారు. స్వయంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంలో వాపోవడం గమనార్హం!
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నాటకీయ పరిణామాల గురించి ఫడ్నవీస్ మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అజిత్ పవార్ తమను సంప్రదించినట్టుగా ఫడ్నవీస్ అంటున్నారు. యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమకు శరద్ పవార్ ఆశీస్సులు కూడా ఉన్నాయని అజిత్ పవార్ తమతో చెప్పాడని.. అందుకే తాము ప్రభుత్వ ఏర్పాటు చేసినట్టుగా ఫడ్నవీస్ చెప్పుకొస్తున్నారు!
అయితే అదంతా శరద్ పవార్ ట్రాప్ అని, తాము మోసపోయామన్నట్టుగా ఫడ్నవీస్ చెప్పుకొస్తున్నారు. అయినా యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ చెప్పాగనే వీరు ఎలా చంకలు గుద్దుకున్నారో మరి. అప్పటి వరకూ ఎన్సీపీని అవినీతి పార్టీ అంటూ తిట్టారు. మోడీతో సహా బీజేపీ వాళ్లంతా అదే మాటే మాట్లాడారు. అలాంటి ఎన్సీపీతో చేతులు కలపడానికి ఎలా ముందుకెళ్లారో చెప్పలేదు ఫడ్నవీస్. తమ అనైతికత గురించి ఆయన మాట్లాడలేదు!
అయితే ఎన్సీపీ మోసం చేసిందని మాత్రం అంటున్నారు. అలాగే మోడీతో శరద్ పవార్ చర్చల గురించి కొన్ని అంశాలే బయటకు వచ్చాయని, తమకు అనుకూలమైన విషయాలను శరద్ పవార్ బయటపెట్టారని, అసలు చర్చల గురించి తాను త్వరలోనే పూర్తి వివరాలను చెబుతానంటూ ఈ మాజీ సీఎం చెప్పుకొచ్చారు. మొత్తానికి శరద్ పవార్ రాజకీయానికి కమలం పార్టీ వాళ్ల కళ్లు బైర్లు కమ్మినట్టుగా ఉన్నాయి. చాలా బేలగా మాట్లాడేస్తున్నారు!