తెలుగుదేశం నుంచి నలుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి చేరడంపై వ్యక్తం అవుతున్న అనుమానాల్లో ఒకటి ఇది. చంద్రబాబు నాయుడే సదరు ఎంపీలను బీజేపీలోకి పంపించారని.. తెలుగుదేశం పార్టీ తరఫునవారు ఉండి కూడా రాజ్యసభలో కానీ, వ్యక్తిగతంగా కానీ చంద్రబాబుకు వారు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేరు. గత ఐదేళ్లపాలన విషయంలో రాబోతున్న కేసుల వ్యవహారంలో కానీ.. ఇతర లాబీయింగ్ కు కానీ వారు కొరగాకపోవచ్చు. అందులోనూ వారందరికీ వ్యక్తిగత బొక్కలు చాలానే ఉన్నాయి.
అలాంటి వారు వారిని కాపాడుకోవడమే కష్టం. అలాంటిది చంద్రబాబును ఏం కాపాడతారు? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు నాయుడే వారిని బీజేపీలోకి పంపించారనే టాక్ వినిపిస్తూ ఉంది. కమలం పార్టీలో ఉన్నా వారు చంద్రబాబు నాయుడి మనుషులే అని, అందులోనూ సీఎం రమేశ్, సుజనా చౌదరిల సంగతి తెలిసిందే అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
వారిద్దరూ చంద్రబాబు వెనుక దశాబ్దాల నుంచి ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారిని చంద్రబాబు నాయుడు ఎంపీలుగా చేసి ఢిల్లీ పంపించారు. చంద్రబాబుకు వాళ్లు సయామీ కవలలు లాంటి వారని, కాబట్టి వారు బీజేపీలోకి చేరడం కేవలం చంద్రబాబు నాయుడి వ్యూహం తప్ప మరోటి కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదివరకూ తెలంగాణలో తన పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారు దున్నలు, పశువులు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇప్పుడు మాత్రం వారు వెళ్లినంత మాత్రాన నష్టం లేదంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 'లాభం' బేరీజు వేసుకునే చంద్రబాబు నాయుడు వారు ఫిరాయించినా నష్టంలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.