జగన్ అలా లాజిక్ మాట్లాడి తప్పు చేశారా?

‘జంగారెడ్డి గూడెం లాంటి మునిసిపాలిటీలో నాటుసారా తయారీ సాధ్యమా’, ‘55వేల జనాభా ఉన్నచోట సారా కాయడం సాధ్యమా.. సచివాలయాలు, మునిసిపాలిటీ వ్యవస్థ, మహిళా పోలీసు, పోలీసు స్టేషన్ ఉన్నచోట కాయగలరా?, మారుమూల ప్రాంతాల్లో తక్కువ…

‘జంగారెడ్డి గూడెం లాంటి మునిసిపాలిటీలో నాటుసారా తయారీ సాధ్యమా’, ‘55వేల జనాభా ఉన్నచోట సారా కాయడం సాధ్యమా.. సచివాలయాలు, మునిసిపాలిటీ వ్యవస్థ, మహిళా పోలీసు, పోలీసు స్టేషన్ ఉన్నచోట కాయగలరా?, మారుమూల ప్రాంతాల్లో తక్కువ మంది మనుషులుండే గ్రామాల్లో సారా కాస్తారన్నా నమ్మొచ్చు.. ఎస్ఈబీ ద్వారా నాటుసారా తయారీపై 13 వేల కేసులు నమోదు చేశాం’ అని ముఖ్యమంత్రి జగన్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. 

ఈ మాటల ద్వారా.. జంగారెడ్డి గూడెం మరణాల విషయంలో నాటుసారా తయారీ కారణం అయిఉండే అవకాశం లేదని చాలా గట్టిగా తన వాదన వినిపించారు. చంద్రబాబునాయుడు మాటలన్నీ అభూత కల్పనలని కొట్టిపారేశారు. కానీ.. సీఎం తన మాటల ద్వారా.. నాటుసారా తయారీదార్ల విచ్చలవిడి తనానికి పరోక్షంగా కారకులు అవుతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.

జంగారెడ్డి గూడెంలో అసహజ మరణాల్ని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబునాయుడు శవరాజకీయాలు చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. ఒకవైపు పచ్చ పత్రికల్లోనే నాటుసారా మరణాలు 18 వరకు జరిగినట్టు వస్తుండగా.. తెలుగుదేశం వారు శాసనసభలో ఈ సంఖ్యను 26వరకు పెంచి రాద్ధాంతం చేయడం గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది. వారి మాటలను నమ్మే అవసరం లేదు గానీ.. అక్కడ నాటుసారా తయారు కావడం లేదనడానికి జగన్ చెప్పిన లాజిక్ మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

సీఎం స్థాయిలోని వ్యక్తి.. మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. ఎక్కువ జనాభా ఉండే మునిసిపాలిటీ గనుక, పోలీసు స్టేషన్, సచివాలయం ఉన్నాయి గనుక నాటుసారా తయారీ జరగదు అనడం కామెడీ అనిపించుకుంటుంది. కనీసం వీలున్న మేరకి ఆ మృతదేహాలకి పక్కాగా శవపరీక్ష చేయిస్తే.. కారణాలు వెలుగులోకి వస్తాయి. అలా చేయిస్తే.. ఆ శపరీక్షల నివేదికల సహా సభలో తెలుగుదేశం ఆరోపణలను, పచ్చమీడియా ప్రచారాన్ని తిప్పికొడితే అది బాధ్యతగల ప్రకటన అనిపించుకుంటుంది. ‘అంతే తప్ప.. అలా ఎలా జరుగుతుంది? అదెలా సాధ్యం?’ అంటూ లాజిక్ లు మాట్లాడితే బాద్యతారాహిత్యం అవుతుంది. 

ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేయడం వలన మరికొన్ని ప్రమాదాలు ఉన్నాయి. జంగారెడ్డి గూడెం స్థాయి మునిసిపాలిటీల పరిధిలో నాటుసారా కాసేవారికి విచ్చలవిడితనం వచ్చేస్తుంది. సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో) వారు కూడా మునిసిపాలిటీలో నాటుసారా తయారీ దొరికినా కేసులు నమోదు చేయరు. 

కేసు పెడితే.. అది సీఎం ప్రకటనకు భిన్నంగా కనిపించి.. ప్రభుత్వం పరువు తీస్తుంది గనుక కేసు పెట్టరు. అలాంటి పట్టణాల్లో నాటుసారా తయారీ వ్యవహారాలు ఏవి దొరికినా.. కేవలం లంచాలతోనే సరిపెడతారు. ఒకసారి లంచాలు ఆ స్థాయిలో రంగప్రవేశం చేస్తే.. ఇక సారా తయారీ కూడా విచ్చలవిడిగా తయారవుతుంది. ..ఇలాంటి లాజిక్ వలన నాటుసారా తయారీ పెరిగితే గనుక, దానికి జగన్ మాటలే బాధ్యత వహించాలి కదా!

రాష్ట్రంలో నాటుసారా తయారీని పూర్తిగా నిర్మూలించగలిగామని సీఎం కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే సారా తయారీ విషయంలో 13 వేల కేసులు పెట్టాం అన్నారు. ఆయన చెప్పిన వివరణ ప్రకారం.. సదరు 13 వేల కేసులు కూడా మారుమూల గ్రామాల్లోనే నమోదయ్యాయని, పట్టణాల్లో తయారీ కేసులు లేవని ఆయన నిరూపించగలరా? కనీసం అలా చేసినా.. ఆయన మాటలకు కాస్త విలువ ఉండేది. 

అవి నాటుసారా మరణాలు కాదని అనడం వేరే సంగతి. కానీ.. అలాంటి ఊర్లో అసలు సారా తయారీ ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించడం తగని పని. ముఖ్యమంత్రి ఇలాంటి అనాలోచిత ప్రకటనతో పప్పులో కాలేసినట్టుగా కనిపిస్తోంది.