లోకేష్ అంటే ఎవరు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా అది చంద్రబాబు మనోగతం. పార్టీకి అదే శిలా శాసనం. అటువంటి చినబాబు విశాఖ టూర్ చేపడితే సీనియర్ నాయకులు ఎందుకు ఆయన వెనకాల లేరు. ఈ ప్రశ్న సహజంగా ఎవరికైనా ఉత్పన్నం అవుతుంది కదా.
తాజాగా లోకేష్ మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించినపుడు ఆయన వెంట ఉన్నది ద్వితీయ శ్రేణి నాయకులే. అలాగే ఎయిర్ పోర్టులో స్వాగతం పలికింది కూడా వారే. మరి చంద్రబాబు తరువాత అంతటి నాయకుడు లోకేష్ తమ ప్రాంతానికి వస్తే ఆయనతో కలసి ఎక్కడా బడా నాయకులు కనిపించలేదు.
ప్రస్తుతం టీడీపీలో దీని మీద చర్చ సాగుతోంది. అయితే అత్త తిట్టిందని కాదు తోడికోడలు చూసిందని బాధ అన్నట్లుగా ఈ విషయాన్ని కెలకడానికి వైసీపీ రెడీగా ఉండడమే అసలు సమస్యగా ఉందిట.
లోకేష్ అంటే విశాఖ టీడీపీ నాయకులకు పట్టలేదా లేక అచ్చెన్నాయుడుకి ఉన్న అభిప్రాయామే మిగిలిన వారికీ ఉందా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి బాగానే సెటైర్లు పేల్చారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు వంటి వారు లోకేష్ పక్కన కనిపించకపోవడాన్ని ఆయన గట్టిగానే టార్గెట్ చేశారు.
మొత్తానికి చినబాబు చిన్నబుచ్చుకునేలా టీడీపీ సీనియర్లు వ్యవహరించారా. ఏమో అది వారి పార్టీ ఇష్టం. ఏది ఏమైనా వైసీపీ మాత్రం లోకేష్ ని ఒక్కలా వదలడంలేదుగా.