చిన్నరాజప్ప ఎన్నిక చెల్లదా?

ఏపీ మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప.. ఇటీవలి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఇరవై మూడు మందిలో ఒకరు. పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిన్న రాజప్ప తన సమీప ప్రత్యర్థి తోట…

ఏపీ మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప.. ఇటీవలి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఇరవై మూడు మందిలో ఒకరు. పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిన్న రాజప్ప తన సమీప ప్రత్యర్థి తోట వాణి మీద విజయం సాధించారు. అయితే చిన్నరాజప్ప ఎన్నిక చెల్లదంటూ ఆమె ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగిందని ఆమె ప్రకటించారు.

చిన్నరాజప్ప తనపై నమోదు అయిన క్రిమినల్ కేసులను దాచేశారని, ఎన్నికల అఫిడవిట్ లో వాటిని పేర్కొనలేదు అని వాణి అంటున్నారు. ఈ మేరకు ఆమె చిన్నరాజప్పపై నమోదు అయిన పాత కేసుల వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై తెలుగుదేశం నేతల దాడి సమయంలో చిన్నరాజప్ప మీద కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పట్లో టీడీపీ నేతలు ఓఎంసీ ఆఫీసులపై దాడి చేశారు. అందుకు సంబంధించి ఇంకా కేసులు కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదట చిన్న రాజప్ప. ఈ విషయాన్ని వాణి ప్రస్తావిస్తున్నారు. చిన్నరాజప్పపై అనర్హత వేటు వేయాలని ఆమె కోర్టును కోరుతున్నారు. ఇదివరకూ కూడా ఇలాంటి అనర్హత వేట్లు పడిన సందర్భాలున్నాయి.

గత పర్యాయంలో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేపై ఇలాంటి కేసుల వ్యవహారంలోనే అనర్హత వేటు పడింది. ఇప్పుడు చిన్నరాజప్పపై కూడా అననర్హత వేటు పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?