దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష అంతకంటే ఎక్కువ సంచలనంగా మారుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ ఉరి శిక్ష అమలుని రాజకీయం చేయాలని చూస్తోంది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దోషులు నలుగురికీ ఉరి ఆలస్యమవుతోందని విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉరిశిక్ష విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇద్దరు హంతకులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ని కోర్టు ఇదివరకే కొట్టివేయగా.. ముకేష్ అనే వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో ఉరిశిక్షకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. యథావిధిగా ఈనెల 22న డెత్ వారెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. అయితే క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత ఉరిశిక్ష వేయాలంటే 14 రోజులు వేచి చూడాలనే నిబంధన ఆధారంగా.. ఉరి అనూహ్యంగా వాయిదా పడింది.
దీంతో.. సరిగ్గా 14రోజుల తర్వాత ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఢిల్లీ కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే మిగిలిన ముగ్గురిలో ఏ ఒక్కరైనా మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటే మాత్రం ఫిబ్రవరి 1 కూడా శిక్ష అమలు కావడం అసంభవం. ఒక వ్యూహం ప్రకారమే హంతకులు నలుగురూ.. ఈ డ్రామాకు తెరతీశారన్నది నిర్వివాదాంశం.
కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ అందరూ ఒకేసారి క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకునే అవకాశముంది, అందరూ ఒకేసారి రాష్ట్రపతిని క్షమాభిక్ష కూడా కోరవచ్చు. కానీ విడతలవారీగా వీరు పిటిషన్లు వేస్తూ, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ ఉరిశిక్షను వాయిదా వేసుకుంటూ పోతున్నారు. అయితే ఇందులో రాజకీయ కోణాల్ని వెదకడమే ఇక్కడ దౌర్భాగ్యం.
క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే హంతకులకు నోటీసులు ఇచ్చి ఉన్నట్టయితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది బీజేపీ వాదన. న్యాయపరంగా అది రాష్ట్రప్రభుత్వం విధి ఎంతమాత్రమూ కాదు. కేవలం చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఆధారం చేసుకుని మాత్రమే నిర్భయ హంతకులు ఇలా శిక్ష వాయిదా పడేలా ప్రవర్తిస్తున్నారు. ఇది తెలిసి కూడా బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీని టార్గెట్ చేస్తూ మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు కూడా గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఢిల్లీ పోలీసులపై అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టండి ఉరిశిక్ష తక్షణం అమలు చేస్తామంటూ సవాల్ విసురుతున్నారు.
మొత్తమ్మీద నిర్భయ కుటుంబానికి న్యాయం చేయడం అనే అంశం పక్కనపడిపోయి… ఈ ఉరిశిక్షలు రాజకీయ క్రీడగా మారడం అత్యంత దారుణమైన విషయం.