ప్రత్యర్థులపై దాడి, ఎదురు దాడి చేసేందుకు పాలక ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ ఓ పథకం ప్రకారం ముందుకెళుతున్నాయి. విమర్శలు చేసే నాయకుల కులం, మతం, ప్రాంతాల ఆధారంగా తమతమ పార్టీల్లోని వాటి ప్రాతిపదికనే నాయకులను ముందుకు తెస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ మరింత రాటు దేలిందనే చెప్పాలి. గత పాలనలో కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన నలుగురు వైసీపీ సభ్యులను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులను కూడా కట్టబెట్టిన ఘనత టీడీపీది.
ప్రస్తుతానికి వస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేయడానికి టీడీపీకి సరికొత్త నాయకురాలు చిక్కారు. ఆమే నటి దివ్యవాణి. రోజా చిత్రపరిశ్రమ నుంచి రావడంతో, అదే నేపథ్యం ఉన్న దివ్యవాణితో మాట్లాడిస్తే బాగుంటుందని భావించిన టీడీపీ…ఆమె కాలికి కత్తి కట్టి రోజాపై తండ్లాటకు వదిలారు.
రాజధాని మహిళా రైతులు గురువారం రోజా వాహనాన్ని అడ్డుకోవడం, ఆ తర్వాత ఆమె తీవ్రస్థాయిలో చంద్రబాబు సహా మిగిలిన నాయకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా విమర్శలను తిప్పికొట్టేందుకు టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మీడియా ముందుకొచ్చారు. రోజా వ్యవహార శైలితో సినీరంగం తలదించుకోవాల్సి వస్తోందన్నారు. రోజా భజన కార్యక్రమాలు ఆపి ప్రజాసమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
పాలనంటే మేకప్ వేసుకోవడం కాదని రోజా తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. గతంలో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు హూందాగా వ్యవహరించారని దివ్యవాణి గుర్తు చేశారు. రోజాపై విమర్శలకే పరిమితం కాకుండా జగన్ పాలనపై కూడా ఆమె విమర్శలు చేశారు.