ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన అంశం రసవత్తరంగా మారింది. ఉరుములేని పిడుగులా ఈ అంశం రచ్చకు ఎక్కింది. జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే జగన్ కు శాపనార్థాలు కూడా పెడుతూ ఉన్నారు. అదేంటో మరి.. అంతా శాపనార్థాలు పెట్టే వాళ్లే తయారయ్యారు. ఈ మధ్యనే సినిమా వాళ్లెవ్వరో ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో కూర్చుని శాపనార్థాలు పెట్టాడు. ఇక అమరావతి ఉద్యమం బ్యాచ్ కూడా ఇవే శాపనార్థాలే పెడుతోంది.
జగన్ విధానాలను వ్యతిరేకించవచ్చు. రాజకీయంగా జగన్ కు ఓటమిని కలగ చేస్తామని హెచ్చరించవచ్చు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు, అంత వరకూ మాట్లాడితే, వారి ఆవేదనలో నిజాయితీ ఉందని బయటి వాళ్లకు అనిపిస్తే.. అంతటి నుంచి కూడా స్పందన వస్తుంది. అంతే కానీ, శాపనార్థాలు పెట్టడం మాత్రం కేవలం అక్కసు అనిపించుకుంటుంది. వారి ఆవేదన కూడా నిజం కాదేమో అనిపించే అభిప్రాయాలను కలిగిస్తుంది ఈ శాపనార్థాలను పెట్టే తీరు.
ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ ఏపీ ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులుగా సాగుతున్న ఈ సమరం ఎంత వరకూ వెళ్తుందనేది ఆసక్తిదాయకంగా ఉంది. ప్రభుత్వాలకూ, వర్సెస్ ఉద్యోగ సంఘాలకూ రచ్చలు కొత్తవి కావు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎదుర్కొన్నవే ఇలాంటి రచ్చలు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు స్ట్రైక్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరించారు.
కార్మికుల స్థానంలో ప్రైవేట్ డ్రైవర్లను పెట్టారు. ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి, పోలీసులను కండక్టర్లుగా కూర్చోబెట్టి కొన్నాళ్ల పాటు ఆర్టీసీ బస్సులను నడిపించారు. ఇలా చంద్రబాబు కార్మికుల పట్లే కఠినంగా వ్యవహరించారు. ఇక తెలంగాణలో గత పర్యాయం కేసీఆర్ సర్కారు వర్సెస్ ఆర్టీసీ కార్మికుల మధ్యన గట్టి యుద్ధమే సాగింది. చంద్రబాబు కన్నా కఠినంగా వ్యవహరించారు కేసీఆర్.
కార్మికులు తామంతట తాము సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించే వరకూ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు! అత్యంత కఠినంగా వ్యవహరించి, కార్మికుల కోరికన కోరికలేవీ తీర్చకుండానే కేసీఆర్ మరోసారి ఎన్నికలకు వెళ్లి నెగ్గారు కూడా. ఇప్పటికీ తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఆర్టీసీ వాళ్లు హ్యాపీగా ఉన్నది ఏపీలో మాత్రమే.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల విషయానికి వస్తే.. వాస్తవాలను మాట్లాడుకుంటే ప్రస్తుతం సంఘంలో అత్యంత సంపన్నపరులు వీరే! టీచర్లూ, ప్రభుత్వ ఉద్యోగులంటే.. అత్యంత సంపాదనపరులు అన్నట్టుగానే ముందుగా చూస్తారు. తర్వాతి సంగతి తర్వాత. ఈ వృత్తుల్లో పని చేసి పెన్షన్లను అందుకుంటున్న వారితో కూడా సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోటీ పడలేనంత స్థాయిలో ఉన్నారు వీళ్లంతా!
ఆ పై ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహారం చేయడం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వ బడుల పై ప్రజల్లో విశ్వసనీయత పడిపోవడంలో టీచర్ల కృషి ఎంతో కూడా వేరే చెప్పనక్కర్లేదు. పనితీరులో అత్యంత నిర్లక్ష్యాన్ని చూపే వారిగా, లంచ గొండులుగా ప్రభుత్వ ఉద్యోగులు సార్థక నామాలను తెచ్చుకున్నారు.
మరి సరిగ్గా జీతాల గురించి చర్చ సందర్భంలో ఇలాంటి అంశాలు చర్చకు కూడనివేమో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంతో.. ప్రజల్లో మాత్రం ఈ అంశాలన్నీ చర్చకు నోచుకుంటున్నాయి.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయా? అనేది మరో ఆసక్తిదాయకమైన చర్చ. ఉన్న ప్రభుత్వాలను అయితే ఉద్యోగులు పడగొట్టలేరు కానీ, ఎన్నికలు మాత్రం వీరికి ఒక మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఓట్లను కలుపుకుంటే లక్షల్లో తేలవచ్చు. మరి వారంతా జగన్ పార్టీకి రేపు ఎన్నికల్లో వ్యతిరేకంగా చేస్తే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడవచ్చు.
అలాగే ప్రజలతో వివిధ పనుల్లో మమేకం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రొపగండాను సాగించే అవకాశాలూ ఉంటాయి. అయితే ఇంకా ఈ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనేది చర్చనీయాంశం. మొత్తానికి జగన్ పెద్ద తేనెతుట్టెనే గట్టిగా కదిపారు.