తమ సేవకు ఎల్లలు లేవని నిరూపిస్తున్న ఆ దేవతా మూర్తులకు కదా మనం పాదాభివందనం చేయాల్సింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవలతో భారతదేశ ఔన్నత్యాన్ని, మనిషిలోని మానవత్వాన్ని పరిమళింప జేస్తున్న కేరళ నర్సులకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోడంలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు కరోనాతో యుద్ధం చేస్తున్నారు. అందుకే ఢిల్లీ ప్రభుత్వం కరోనాతో యుద్ధంలో ఒక వేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులకు సేవలందించడంలో భారత్‌లోని కేరళకు చెందిన నర్సలు ముందు వరుసలో ఉన్నట్టు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కేరళ నర్సులే ఎక్కువ మంది సేవలందిస్తున్నారు. కేరళలో చదువుకున్న 30 శాతం మంది నర్సలు అమెరికా, బ్రిటన్‌లో, 15 శాతం మంది ఆస్ట్రేలియాలో, మరో 12 శాతం మంది మధ్య తూర్పు ప్రాంతంలో సేవలందిస్తున్నారు.
కరోనా మహమ్మారి విర్రవీగుతూ దూసుకొస్తుంటే కారు మబ్బులు ఆవరించి జీవితం అంధకారమైన వేళ కేరళ నర్పుల సేవలు వెలుగు దివిటీలు అయ్యాయి. ఈ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు అన్నా సౌబ్రీ కేరళ నర్సుల సేవానిరతిని కొనయాడారు. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
“విదేశాల నుంచి వచ్చిన నర్సులు మా దేశంలో పనిచేయడం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు. ప్రతిభ, సేవా నిరతి ఉన్న భారతదేశానికి చెందిన నర్సులు …ముఖ్యంగా కేరళ నుంచి వచ్చిన నర్సుల నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం కూడా” అని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత కంటే కేరళ నర్సుల గొప్పదనం చాటడానికి ఏం కావాలి?
అంతు తెలియని వైరస్‌తో నరకయాతన అనుభవిస్తూ, ఆర్తనాధాలు చేస్తున్న అభాగ్యుల పాలిట కేరళ నర్సులు దేవతలుగా కనిపిస్తున్నారు. కరోనా వైరస్‌కు గురైన రోగులు కొన ఊపిరితో బతుకు పోరాటం చేస్తున్న వాళ్లకు తమ సేవలతో కొత్త ఊపిరి పోస్తున్నారు. బతుకుపై నమ్మకాన్ని, జీవితంపై ఆశలను రేకెత్తిస్తున్న కేరళ నర్సుల సేవలు అమూల్యం.
ముఖ్యంగా అమెరికా, బ్రిటన్లలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదు. ఆ దేశాల్లో కరోనా రోగులు జీవితంపై ఆశలు విడిచి పెట్టుకుంటున్న దశలో…తామున్నామంటూ కేరళ నర్సులు అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవసేవ మాధవ సేవ అని సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న కేరళ నర్సులకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. “ప్రార్థించే పెదవుల కన్నా…సాయం చేసే చేతులు మిన్న” అనే మదర్ థెరిస్సా స్ఫూర్తితో వెల కట్టలేని వైద్య సేవలందిస్తున్న కేరళ నర్సుల మానవత్వానికి పాదాభివందనం.