షర్మిల ఆ పని చేస్తుందా ?

షర్మిల ఒక కొత్త ప్రయత్నం చేస్తోందని, పరోక్షంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోకి దిగుతోందని సమాచారం. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడానికే షర్మిల సాహోసోపేతమైన స్టెప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. షర్మిల  తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ…

షర్మిల ఒక కొత్త ప్రయత్నం చేస్తోందని, పరోక్షంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోకి దిగుతోందని సమాచారం. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడానికే షర్మిల సాహోసోపేతమైన స్టెప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. షర్మిల  తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఉన్నట్లుండి తెలంగాణాకు వచ్చేసింది. తన తండ్రి వైఎస్సాఆర్ పేరుతో పార్టీ పెట్టేసింది. వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వస్తానని కూడా ధీమా వ్యక్తం చేసింది. 

ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీలో ఎదుగుదల లేదనే విమర్శలు వస్తున్నాయి. అవి కేవలం విమర్శలే కాదు వాస్తవం కూడా. తాను తెలంగాణలో పార్టీ పెడుతున్నానని చెప్పినప్పుడు ఒకవిధమైన ఊపు కనిపించింది. టీఆర్ఎస్ కూడా షేక్ అయిందనే చెప్పాలి. కానీ కొంత కాలానికే ఈ ఊపు తగ్గిపోయింది. పార్టీలో కొత్తగా ఎవ్వరూ చేరలేదు. కొత్త చేరికలు లేకపోగా ఉన్నోళ్లు కొందరు బయటకు పోయారు. షర్మిల పార్టీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కూడా వెళ్ళిపోయింది. 

పార్టీలో కొత్తగా ఎవరూ చేరకపోయినా షర్మిల మాత్రం నిరుద్యోగ నిరాహార దీక్షలు చేసుకుంటూ పోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆమె డిమాండ్ నెరవేరేది కాదు. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదని ఈ మధ్యనే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఐఐటీలో చెప్పాడు. 

ఇదిలా ఉంటే రాజకీయంగా ఎదగడానికి షర్మిల ఏమీ చేయడంలేదని. టీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ హుజూరాబాద్ లో మోహరిస్తుండగా షర్మిల అటువైపు దృష్టి పెట్టలేదని కొందరు విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేయబోదని షర్మిల ఎప్పుడో ప్రకటించింది. ఈ ఎన్నిక మీద ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎవరైనా నిరుద్యోగి పోటీ చేస్తే సహకరిస్తామని చెప్పింది. 

అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఊహించని విధంగా షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయాలని కొంతకాలంగా దీక్షలు, నిరసనలు చేస్తున్న వైఎస్ షర్మిల.. హుజూరాబాద్‌లో నిరుద్యోగులు పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఇదే అంశాన్ని వైఎస్ఆర్‌టీపీ సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న వైఎస్ఆర్‌టీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. నిరుద్యోగులతో దగ్గరుండి హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్‌టీపీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీపై కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే సరిపోదని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నిరుద్యోగులతో హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్‌టీపీ యోచిస్తున్నట్టు సమాచారం.

ఇలా చేయడం వల్ల ప్రజలు, నిరుద్యోగుల్లోనూ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని వైఎస్ షర్మిల అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. విపక్షాలు కూడా నిరుద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసే ఈ చర్యలను తప్పుబట్టలేవని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్‌లో పోటీ చేయకపోయినా.. అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిల వ్యూహం ఫలిస్తుందా ? చూద్దాం ఏమవుతుందో.