కరోనా వ్యాప్తి, నియంత్రణ విషయంలో డబ్ల్యూహెచ్వో తీరు ఎంతలా వివాదాస్పదం అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ మహమ్మారి చైనాలో వ్యాపిస్తున్న దశలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మిగతా దేశాలను హెచ్చరించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదనేది సుస్పష్టం. కనీసం జనవరి నుంచి అయినా మిగతా ప్రపంచ దేశాలు చైనాతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని ఉంటే.. కరోనా ప్రభావం ఇంత ఉండేది కాదు.
చైనా ఓటుతో డబ్ల్యూహెచ్వో పగ్గాలు చేపట్టి టెడ్రోస్ ఆ దేశానికి బానిసలాంటివాడని, ఇప్పటికీ చైనాను సమర్థిస్తూ అతడు తన బానిసత్వాన్ని చాటుకుంటున్నాడనే అభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దుమ్మెత్తి పోశాడు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్వోకు నిధుల నిలుపుదలను కూడా ప్రకటించారాయన. అయితే అది తాత్కాలిక నిలుపుదల మాత్రమే.
తాజాగా ట్రంప్ రెండో నంబర్ హెచ్చరిక చేశారు. నెల రోజుల్లోగా చెప్పుకోదగిన పరిణామాలను చూపించకపోతే డబ్ల్యూహెచ్వోకు అమెరికా పూర్తిగా నిధులను నిలిపేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ తను తాత్కాలిక నిధుల నిలుపుదలను చేసినట్టుగా, నెల రోజుల్లోగా డబ్ల్యూహెచ్వో మార్పును చూపించకపోతే అమెరికా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు శాశ్వతంగా నిధులు నిలిచిపోతాయని ట్రంప్ తేల్చాడు. అందుకు సంబంధించిన లెటర్ ను ట్విటర్లో పోస్టు చేశారు అమెరికా అధ్యక్షుడు.
డబ్ల్యూహెచ్వోకు 20 శాతం నిధులు అమెరికా నుంచినే వస్తాయట. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే నిధుల కటింగ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఆ పని చేయాల్సింది కాదని చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో శాశ్వతంగా నిధులు కట్ చేయడమే నెక్ట్స్ అంటూ ట్రంప్ రెండో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. నెల రోజుల గడువు ఇచ్చారు. మరి ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో ఏమంటుందో!