జగన్‌ సర్కార్‌పై బురద జల్లితే ఏమొస్తుంది.?

దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు.. ఆఖరికి గ్రామాలు కూడా ‘కంచెలు’ నిర్మించేసుకుంటున్నాయి.. ఇతరులెవరూ రాకుండా. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అంతలా విలవిల్లాడిస్తోంది. దేశంలో 21 రోజలపాటు లాక్‌డౌన్‌ని విధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన…

దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు.. ఆఖరికి గ్రామాలు కూడా ‘కంచెలు’ నిర్మించేసుకుంటున్నాయి.. ఇతరులెవరూ రాకుండా. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అంతలా విలవిల్లాడిస్తోంది. దేశంలో 21 రోజలపాటు లాక్‌డౌన్‌ని విధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అంతకు ముందే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్లు, కర్‌ఫ్యూలనీ ప్రకటించేశాయి. ఈ పరిస్థితుల్లో ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణించాలన్న ఆలోచనే అతి భయంకరమైనది.. నిర్లక్ష్యంతో కూడుకున్నది కూడా.!

కానీ, తెలంగాణ పోలీసుల్ని అభ్యర్థించి, వారి ద‌గ్గ‌ర‌ అనుమతి లేఖలు తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కి పయనమయ్యారు చాలామంది. ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్‌లో చాలామందిని అక్కడి పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. కొద్ది గంటల్లోనే వందలాది వాహనాలు, వేలాది జనం ఒక్క చోట గుమికూడిపోయారు. ఇదీ నిన్న మధ్యాహ్నం నుంచీ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి. ‘మా రాష్ట్రానికి మేం వెళ్ళిపోతాం.. మమ్మల్ని అనుమతించండి మొర్రో..’ అంటూ పోలీస్‌ స్టేషన్ల వద్ద జనం ధర్నాలు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతుంది.?

మరోపక్క, తమ రాష్ట్రంలోకి పెద్ద సంఖ్యలో వస్తున్నవారికి ఎలా ‘ప్రవేశం’ కల్పించాలో తెలియని అయోమయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ది. ఇలా వచ్చినవారిలో ఎవరికన్నా కరోనా పాజిటివ్‌ అయితే, ఆ తర్వాత పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోతాయి. అటు కేంద్రం ఆదేశాలు.. ఇటు ఇప్పటికే రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్‌ అయిన వాతావరణం.. వెరసి, కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక్కడ ఎవర్నీ తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ, ఇక్కడ సమాచార లోపం సుస్పష్టం. సమన్వయం లేకపోవడంతో.. ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ, హైద్రాబాద్‌ నుంచి తరలివెళ్ళినవాళ్ళలో చాలామంది, జగన్‌ సర్కార్‌ని నిందించడం షురూ చేశారు. ‘ఇదేనా మీ ప్రజల పట్ల మీకున్న బాధ్యత.?’ అంటూ కొందరు రెచ్చిపోయారు. కొందరైతే అత్యుత్సాహంతో రాజకీయ విమర్శలు కూడా చేశారు. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోకుండా ఎవరికి వారు.. జగన్‌ సర్కార్‌పై దూషణలకూ దిగారు.

మొత్తమ్మీద, జగన్‌ సర్కార్‌ పెద్ద మనసు చేసుకోవడంతో.. పరిస్థితి కొంతమేర అదుపులోకి వచ్చినట్లే కన్పిస్తోంది. అయితే, మళ్ళీ అందులో కొందరు, ‘క్వారంటైన్‌’కి ఒప్పుకోకపోవడం గమనార్హం. ‘వాళ్ళు పంపారు, మేం వచ్చేశాం.. బాధ్యత మీదే..’ అంటూ అసహనానికి లోనై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీద బురదజల్లే ముందు.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుంటే మంచిది ఎవరికైనా.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు