మాయమాటలు చెప్పి ఓ అమ్మాయిని పాడుబడిన ఇంట్లో నిర్బంధించారు. ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశారు. 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. ఇది సినిమా స్టోరీ కాదు. దేశంలో ఇంకెక్కడో జరిగిన ఘటన కూడా కాదు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితుల్ని పట్టుకునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త చాన్నాళ్ల కిందటే చనిపోవడంతో పిల్లల ఆలనాపాలనా తనే చూసుకుంటోంది. ఈ క్రమంలో పదో తరగతి వరకు చదివిన రెండో కుమార్తె, చిన్న ఉద్యోగం చేసే ఆలోచన చేసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అనిత అనే స్థానిక మహిళ.. పాపకు రాజమండ్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది.
ఓ రోజు అమ్మాయితో కలిసి అనిత రాజమండ్రికి బయల్దేరింది. అయితే అప్పటికే అనిత ప్లాన్ సిద్ధం చేసింది. రాజమండ్రికి చెందిన ఓ బ్యాచ్ తో రేటు మాట్లాడుకుంది. గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ గదికి అమ్మాయిని తీసుకెళ్లింది. అక్కడున్న వ్యక్తులు ఆమెకు జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో అమ్మాయి అపస్మారక స్థితికి చేరుకుంది. డబ్బు అందుకొని అనిత అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
అలా అమ్మాయిని నిర్బంధించిన దుండగులు 4 రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి లేకుండా ఇంటికి ఒంటరిగా వచ్చిన అనితను కూతురు ఏమైందంటూ తల్లి ప్రశ్నించింది. పని ఎక్కువగా ఉందని, కొన్ని రోజుల తర్వాత వస్తుందని బుకాయించే ప్రయత్నం చేసింది అనిత.
అయితే అప్పటికే 3 రోజులు అవ్వడంతో అనుమానంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగిన కోరుకొండ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని కనిబెట్టి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 2 రోజుల తర్వాత కోలుకున్న అమ్మాయి విషయం మొత్తం పోలీసులకు చెప్పింది. దీంతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా నలుగురు అనుకుంటే ఆ తర్వాత సంఖ్య 7కు చేరింది. పూర్తి విచారణ జరిపి ఇందులో ఎంతమంది నిందితులున్నారో కనిబెట్టే పనిలో పడ్డారు పోలీసులు.