కోవిడ్ గండాన్ని ఇండియా దాదాపు దాటేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైద్య పరిశోధకులు. గత కొన్నాళ్లుగా కోవిడ్ వైరస్ ఇండియాలో ప్రవర్తిస్తున్న తీరు, నమోదవుతున్న కేసులు.. ఇతర విశ్లేషణల ఆధారంగా వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ప్రత్యేకించి ఇటీవల ఇండియాలో పండగ సీజన్లు ముగియడం, ఆ తర్వాత కూడా కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల ఏదీ చోటు చేసుకోకపోవడంతో.. రిలీఫ్ లభించినట్టే అనే అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడింది.
దసరా, దీపావళి సీజన్లలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఇది వరకే పరిశోధకులు చెబుతూ వచ్చారు. అయితే పెద్ద గా కాదు, ఏ మాత్రం జాగ్రత్త చర్యలు లేకుండానే.. ఇండియాలో ప్రజలు పండగలను జరుపుకున్నారు. దసరా, దీపావళి సంబరాల సమయంలో అసలు కోవిడ్ ప్రస్తావన లేదు. కరోనా జాగ్రత్త చర్యలను మనోళ్లు ఆల్రెడీ అటకెక్కించారు.
నూటికి 90 మంది మాస్కులు ధరించడాన్ని దాదాపు మానేశారు. ఇక శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు కూడా మళ్లీ మరిచిపోయారు. ఇక బస్సులు రద్దీ ప్రయాణాలనే చేస్తున్నాయి. భౌతిక దూరం ఊసే లేదు. ఇక స్కూళ్లు తెరుచుకున్నాయి. పెళ్లిళ్లు, వేడుకలూ, ఇతర కార్యక్రమాలన్నింటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఎలాజరగాల్సినవి అలా జరుగుతున్నాయి. మరి ఇంత జరిగినా.. అక్టోబర్ లో కానీ, నవంబర్లో కానీ కేసుల సంఖ్య మళ్లీ చెప్పుకోదగిన స్థాయిలో పెరగకపోవడమే .. కోవిడ్ గండాన్ని ఇండియా దాదాపు దాటినట్టే అనే అభిప్రాయానికి కారణం.
మరోవైపు విదేశాల్లో కరోనా కేసులు చెప్పుకోదగిన స్థాయిలో నమోదవుతున్నాయి. ఇండియా నుంచి విదేశాలకు ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చే వారు రావడమూ జరుగుతోంది. గతంలో ఇలాంటి తరహాతోనే కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అయితే ఇప్పుడు విదేశీ రాకపోకలు జరుగుతున్నా.. కేసుల సంఖ్యపై ఈ ప్రభావం ఏదీ కనిపించడం లేదు!
కొన్ని యూరోపియన్ దేశాలు మళ్లీ లాక్ డౌన్లు అంటున్నా.. ఇండియా అలాంటి వార్తలను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇండియన్స్ లో హెర్డ్ ఇమ్యూనిటీ సాకారం అయ్యిందనే మాట వినిపిస్తూ ఉంది. రెండో వేవ్ లో అధికారిక గణాంకాల కన్నా చాలా ఎక్కువ మందికి కరోనా సోకి వెళ్లిందని, అలాగే వ్యాక్సినేషన్ వల్ల కూడా చాలా మందికి కరోనాను ఎదుర్కొనగల ఇమ్యూనిటీ సాధ్యమైనందని పరిశోధకులు అంటున్నారు.
వీటన్నింటి ఫలితంగా.. అక్టోబర్ లోనే వస్తుందనుకున్న కరోనా మూడో వేవ్ సాధ్యపడలేదని చెబుతున్నారు. ఒకవేళ మళ్లీ ఇండియాలో కేసుల సంఖ్య కాస్త పెరిగినా.. మరీ తీవ్ర ప్రభావం ఏదీ ఉండదని కూడా అంటున్నారు. అయితే కోవిడ్ గండాన్ని పూర్తిగా జయించేశాం అనడానికి మాత్రం లేదంటున్నారు. మరి కొన్ని నెలలు.. అంటే కనీసం వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల వరకూ వేవ్ లు ఏవీ తలెత్తకపోతే… కోవిడ్ గండాన్ని దాటి మరిన్ని అడుగులు ముందుకు పడినట్టే అని అంటున్నారు.