ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్టు …ఒకే ఒక్క ఓటమి చంద్రబాబు కళ్లు తెరిపించాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి తీవ్ర మానసిక వేదన మిగిల్చాయి.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఏకంగా 89 పంచాయతీల్లో 74 వైసీపీ, తన పార్టీ మద్దతుదారులు కేవలం 14 చోట్ల మాత్రమే గెలుపొందడం బాబు జీర్ణించుకోలేక పోయారు. కుప్పంలోనే టీడీపీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవి చూడడంతో చంద్రబాబుపై అధికార పార్టీ నేతలు విమర్శలకు పదును పెట్టారు.
అధికార విమర్శలను తట్టుకోలేక తండ్రీకొడుకులు బూతులకు పాల్పడ్డారు. వైసీపీ దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని, అలాగే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం వల్లే తమ మద్దతుదారులు ఓటమి పాలయ్యారని కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది.
ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు చంద్రబాబు పర్యటించారు. పర్యటన ముగింపు సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. గ్రూపులు కట్టడం వల్లే కుప్పంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపిజం వదిలిపెట్టి అందరూ ఐక్యంగా ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరి లోపాలు ఒకరు బయట పెట్టుకోవడం మంచిది కాదని బాబు హితవు పలికారు. నాయకులు పని చేయకపోవడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యామని, ఈ విషయం గుర్తుం చుకుని తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించడం గమనార్హం. కుప్పం పర్యటనకు ముందు మీడియాతో ఒకలా, పర్యటనలో పార్టీ శ్రేణుల ఎదుట మరోలా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమికి పార్టీలో గ్రూపిజిమే కారణమని బాబు అంగీకరించారు. కనీసం పార్టీ శ్రేణుల ఎదుటైనా వాస్తవాలనే మాట్లాడారు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఇదే కాబోలు. ఈ మాత్రం సంబడానికి …చంద్రబాబు అంత ఓవరాక్షన్ చేయడం ఎందుకో? అనే విసుర్లు వినిపిస్తున్నాయి.