కడప జిల్లా రాజకీయాల్లో ఇదో విచిత్ర పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు వింటే చాలు ఆయనకు కోపం. కానీ ఆయన తనయులకు మాత్రం వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కడం గమనార్హం. జగన్‌ను విమర్శించే ఆ తండ్రి పేరే డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి. మైసూరారెడ్డి తనయుడు మూలె హర్షవర్ధన్‌రెడ్డి, తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి తనయుడు డాక్టర్ మూలె సుధీర్‌కుమార్‌రెడ్డి. మైసూరాకు తనయులైన వీళ్లిద్దరికి జగన్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది.
కానీ మైసూరారెడ్డి మాత్రం జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చర్చకు దారి తీసింది. గతంలో మైసూరారెడ్డి వైసీపీలో కొనసాగారు. అయితే రాజ్యసభ పదవి విషయంలో తలెత్తిన విభేదాలు…ఆయన్ని పార్టీకి దూరం చేశాయి.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం నెలకున్న నేపథ్యంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా నీళ్ల పంపకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు రాజకీయ లబ్ధి కోసమే జల జగడం సృష్టించి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, గ్రేటర్ రాయలసీమ ఉద్యమ కమిటీ నేత ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. వాళ్లిద్దరూ చర్చించు కుంటే పరిష్కారమయ్యే సమస్యకు పెద్దది చేసి పంచాయితీని కేంద్రం చేతల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు.
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ, సోమశిల, కండలేరు సాగునీటి పథకాలకు గొడ్డలి పెట్టు అని మైసూరారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కేంద్రానికి తాము రాసిన లేఖల వల్లే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుని గెజిట్ విడుదల చేసిందని జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. మరోవైపు కేంద్రప్రభుత్వం అట్లా చేయడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మైసూరారెడ్డి తనయుడు మూలె హర్షవర్ధన్‌రెడ్డి ఎర్రగుంట్ల నగర పంచాయతీ చైర్మన్ కాగా, ఆయన తమ్ముడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే. మైసూరారెడ్డితో విభేదించిన తనయులిద్దరూ జగన్‌తో రాజకీయ ప్రయాణం సాగిస్తుండడం విశేషం.
కానీ జగన్ ప్రభుత్వంపై మైసూరా విమర్శల నేపథ్యంలో, తనయులిద్దరూ వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో వుండడం, మళ్లీ ఆ ఇంటి పెద్ద మనిషే విమర్శలు చేస్తుండడం, ఇదెక్కడి రాజకీయమనే చర్చ కడప జిల్లాలో జరుగుతోంది.