ఫిబ్రవరి 29…ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నాలుగేళ్లకు ఒకసారి మాత్రం ఫిబ్రవరిలో 29 రోజులు వస్తాయి. దీన్నే లీప్ సంవత్సరం అని పిలుచుకుంటాం. అసలు ఈ లీప్ సంవత్సరం ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఏడాదికి 365 రోజులుంటాయి. కానీ ప్రతి ఏడాది మరో ఆరు గంటల సమయం అదనంగా ఉంటుంది. ఈ సమయాన్ని ఎటూ లెక్కకట్టలేక…ఇలా నాలుగేళ్లకు ఒకసారి మొత్తం సమయాన్ని కలిపి లెక్క కడితే 24 గంటల సమయమవుతుంది. అంటే ఒకరోజు అన్నమాట. దీన్ని ఫిబ్రవరి నెలలో కలిపి చెబుతూ వస్తున్నారు. అందుకే నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29ని లీప్ ఏడాదిగా పిలుచుకుంటున్నాం.
మరో ఆసక్తికర కథనం
ప్రతి దానికి ఓ చారిత్రిక నేపథ్యం ఉంటుంది. లీప్ ఏడాదికి కూడా ఓ చరిత్ర, కథ లేకపోలేదు. అది ఎంతో ఆసక్తికరమైందనే విషయం ఎంత మందికి తెలిసి? మరి తెలుసుకుందామా?
రోమన్ క్యాలెండర్లో ఏడాదికి 355 రోజులు మాత్రమే ఉండేవట. కానీ ప్రతి రెండేళ్లకు నెలలో 22 రోజులున్న నెల అదనంగా చేరేదట. అయితే రోమన్కు జూలియస్ క్యేసర్ చక్రవర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత క్యాలెండర్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి శతాబ్దంలో ప్రజలకు మెరుగైన క్యాలెండర్ను ఇవ్వాలని ఆ చక్రవర్తి పట్టుపట్టాడు. దీంతో రోమన్ రాజ్యంలోని మేధావులందరూ మేధోమధనం చేసి చక్రవర్తి ఆకాంక్షల మేరకు ఏడాదికి 365 రోజులు చేర్చి క్యాలెండర్ను రూపొందించారని చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకరోజు ఎక్కువ వస్తుందని, దాన్ని ఆగస్టు నెలలో కలపాలని అప్పట్లో నిర్ణయించారట. ఆ విధంగా రోమన్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలలో 30 రోజులు, జూలైలో 31, ఆగస్టులో 29 రోజులు ఉండేలా తీర్చిదిద్దారని చరిత్ర చెబుతోంది.
అయితే ఆ తర్వాత రోమన్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన క్యేసర్ ఆగస్టస్ క్యాలెండర్లో మార్పులు చేశారు. తాను జన్మించిన ఆగస్టు నెలలో 29 రోజులు మాత్రమే ఉండటం ఆయన ఇష్టపడలేదట. తనకంటే ముందు చక్రవర్తిగా పాలన సాగించిన జూలియస్ క్యేసర్ చక్రవర్తి పుట్టిన ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండేలా చేసి, తాను పుట్టిన ఆగస్టుకు మాత్రం సంపూర్ణంగా 31 రోజులు ఉండేలా క్యాలెండర్ను మరోసారి రూపొందించారని చరిత్రకారులు చెబుతున్న మాట. ఆ క్యాలెండరే ఇప్పటికీ అమల్లో ఉంది. ఇదన్న మాట లీప్ ఏడాది కథా కమామీషు.