ముఖ్యమంత్రి జగన్ తన చేతగానితనంతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘అన్ని శాఖల్లో అస్థిరత ఏర్పడింది. రుణ అవకాశాలు నీరుగారాయి. తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించాలి’ అని యనమల ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆర్థికశాఖ ‘పండ్లు’ ఊడగొట్టి ఇప్పుడు బడాయి మాటలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కార్ వైపు వేలు చూపుతున్న యనమల వారు, ఒక్కసారి మిగిలిన నాలుగు చేతి వేళ్లు తనవైపే చూపుతున్నాయనే నిజాన్ని గుర్తించాలని రాజకీయ విశ్లేషకులు, మేధావులు హితవు చెబుతున్నారు. ఈ సందర్భంగా గతంలో యనమల రామకృష్ణుడు తన చేతిలోనే ఆర్థికశాఖ ఉంది కదా అనే అహంకారంతో ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో వారు గుర్తు చేస్తున్నారు.
సింగపూర్‌లో యనమల రూట్ కెనాల్ వైద్యానికి ఏకంగా రూ.2.82 లక్షలు విడుదల చేస్తూ చంద్రబాబు సర్కార్ జీవో విడుదల చేయడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదే వైద్యాన్ని భారత్‌లో ఎక్కడ తీసుకున్నా కేవలం రూ.10 వేలు ఖర్చు అవుతుందని, అలాంటిది వందల రెట్లు ప్రజాధనాన్ని…అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కలిసి తమ వర్గీయులకు చెందిన కార్పొరేట్ సంస్థలకు ధారపోశారని మండిపడుతున్నారు.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం చేయించేందుకు దాదాపు రూ.3 లక్షలు దుర్వినియోగం చేసిన యనమలకు ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం అమరావతిలో రూట్ కెనాల్ వైద్య సదుపాయం కూడా కల్పించలేని అసమర్థ పాలన సాగించారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఫైనాన్స్ మినిస్టర్‌గా ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ‘పండ్లు’ ఊడగొట్టడం మరిచారా? అంటూ యనమలను పలువురు ప్రశ్నిస్తున్నారు.