జనసేన నుంచి లక్ష్మీనారాయణ తప్పుకున్నారు. పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన సినిమాలపై పవన్ కు స్పందించక తప్పలేదు. అందరికీ తెలిసినా ఇన్నాళ్లూ ఈ విషయాన్ని గుంభనంగా దాచిన పవన్, తప్పనిసరి పరిస్థితుల మధ్య తను సినిమాలు చేస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు.
“వి.వి.లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.”
ఇలా లక్ష్మీనారాయణ రాజీనామానాను ఆమోదిస్తూనే, తను సినిమాలు చేస్తున్న విషయాన్ని తొలిసారిగా ఒప్పుకున్నారు పవన్. మొత్తమ్మీద పవన్ తో సినిమాల గురించి స్పందించేలా చేయగలిగారు లక్ష్మీనారాయణ.
పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం జనసైనికులకు (అతడి అభిమానులకు) ఇష్టమే కావొచ్చు. కానీ పవన్ రాజకీయాలనే నమ్ముకొని అతడితో పాటు చేతులు కలిపిన లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రేపు ఉదయం పవన్ షూటింగ్ చేసుకుంటుంటే, లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు ఎలా ఉద్యమాలు చేయగలరు, ప్రజల్లోకి ఎలా వెళ్లగలరు.
మీ అధ్యక్షుడే సినిమాలు చేసుకుంటుంటే మీకెందుకు రాజకీయాలంటూ హేళనగా ఎవరైనా మాట్లాడితే, ఉన్నత విద్యావంతులైన లక్ష్మీనారాయణ ఏం సమాధానం చెబుతారు? అందుకే భేషరతుగా తప్పుకున్నారాయన. కాస్త బుర్ర పెట్టి ఆలోచించే ఏ నాయకుడు జనసేనలో ఇకపై ఎంత మాత్రం కొనసాగలేడు.