పన్నెండు ఫ్లై ఓవర్లు…అద్భుతమే…

జనాభా పెరుగుతోంది. దానికి అనుగుణంగా ట్రాఫిక్ పెరుగుతోంది. రోడ్డు మీదకు వస్తే ఎక్కడ ఇరుక్కుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో ఫ్లై  ఓవర్స్ అవసరం చాలా ఏర్పడుతోంది. ఇక విశాఖ లాంటి మెట్రో…

జనాభా పెరుగుతోంది. దానికి అనుగుణంగా ట్రాఫిక్ పెరుగుతోంది. రోడ్డు మీదకు వస్తే ఎక్కడ ఇరుక్కుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో ఫ్లై  ఓవర్స్ అవసరం చాలా ఏర్పడుతోంది. ఇక విశాఖ లాంటి మెట్రో సిటీ విషయమే తీసుకుంటే పాతిక లక్షల దాకా జనాభా ఉన్నారు. తెల్లారుతూనే రోడ్ల మీదకు వాహనాలు వెల్లువలా వస్తాయి. దాంతో సిటీలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా గంటల టైమ్ పడుతోంది.

అయితే విశాఖకు తొలి ఫ్లై ఓవర్ దివంగత సీఎం వైఎస్సార్  టైమ్ లో వచ్చింది. ఆ తరువాత మెల్లగా మరో మూడు కూడా వచ్చాయి. అయితే ఇవి సరిపోవడంలేదు, విశాఖ మీదుగా పోయే జాతీయ రహదారిలో ప్రయాణం చేయాలంటే డైలీ నరకం చూస్తున్నామని జనం పెద్ద ఎత్తున  ఘోష పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర పెద్దలను కలసి విశాఖకు వివిధ కీలకమైన‌ ఏరియాల్లో మరో పన్నెండు ఫ్లై ఓవర్ల అవసరం ఉందని చెప్పారు. దాని మీద జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కి ఆయన వినతిపత్రం కూడా ఇచ్చారు.

దీనికి ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి విశాఖకు కొత్తగా ఫ్లై ఓవర్లను పెద్ద ఎత్తున నిర్మించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఇపుడు స్థానిక ఎంపీ నుంచి కూడా వినతులు వెళ్లాయి. కేంద్రం కూడా దీని మీద సానుకూలంగా ఉంది అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే విశాఖ సిటీ పరిధిలో మరో పన్నెండు ఫ్లై ఓవర్స్ వచ్చేస్తాయి. కీలకమైన ప్రాంతాలు, జంక్షన్లలో రద్దీ లేకుండా హ్యాపీగా  ప్రయాణం సాగిపోయే రోజులు వచ్చేస్తాయి.

ఇక హైదరాబాద్ తరువాత ఎక్కువ ఫ్లై ఓవర్లు కలిగిన సిటీగా విశాఖ గుర్తింపు పొందనుంది. ఫ్లై ఓవర్లకు సంబంధించి డీపీఆర్ త్వరలోనే రెడీ అవుతుందని వైసీపీ ఎంపీ అంటున్నారు, మొత్తానికి అభివృద్ధికి మారు పేరుగా విశాఖను చేస్తామని చెబుతున్నారు. అంతకంటే విశాఖ  జనాలకు కావాల్సినది ఏముంది.