దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా.. దాదాపు అన్ని రాష్ట్రాలు సోమవారం నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ తెరిచేందుకు అనుమతులిచ్చేశాయి. ఈ నేపథ్యంలో చాలామంది భోజనప్రియులు హోటళ్లు తెరిచీ తెరవంగానే ఫస్ట్ ఆర్డర్ తామే ఇవ్వాలంటూ ఉత్సాహపడుతున్నారు. ఇన్నాళ్లూ లాక్ డౌన్ లో నోరు కట్టేసుకున్న నాన్ వెజ్ ప్రియులు రెస్టారెంట్లకు వెళ్లి తమకిష్టమైన మెనూ లాగించేసి వద్దామని ఉబలాటపడుతున్నారు. అయితే ఇలాంటి ఆలోచనలన్నీ ప్రస్తుతానికి కట్టిపెట్టాలని, నెల రోజుల వరకు బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినకుండా ఉండటమే మేలని సలహా ఇస్తున్నారు నిపుణులు.
లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ మూసేసి ఉన్నారు. అయితే లోపల నిల్వ ఉన్న సరుకులు మాత్రం అలాగే ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రీజర్ లో పెడితె ఎన్ని నెలలైనా అలాగే ఉంటాయి. పిండి పదార్థాలు, వంట సామాన్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ముక్కిపోయి, పురుగులు పట్టి ఉంటాయి. అసలే లాక్ డౌన్ నష్టాలతో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు.. సడన్ గా అన్నీ ఫ్రెష్ గా తీసుకొచ్చి వండి వారుస్తారంటే నమ్మలేం.
నిల్వ ఉన్న సరుకుల్ని కూడా జాగ్రత్తగా రీఫ్రెష్ చేసి ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. నిల్వ ఉన్న నూనె, ఇతర పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, నిల్వ ఉన్న నాన్ వెజ్ తింటే లేనిపోని జబ్బులు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు న్యూట్రిషనిస్టులు.
ఇక ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో ఎక్స్ పైరీ డేట్స్ చూడటం తప్పనిసరి. రెండున్నర నెలలుగా నిల్వ ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, ఇతర కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీమ్ లు వంటివాటిని ప్యాకింగ్ గమనించి తీసుకోవాలని, హడావిడిగా కొనేసి, నోట్లో వేసుకుని చప్పరిస్తే మీ ఖర్మ మీరు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వీలైతే 15 రోజులు, లేదంటే.. దాదాపు నెలరోజుల పాటు హోటళ్లు, రెస్టారెంట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
అయితే జనాలు ఆగుతారా అంటే అనుమానమే. ఇప్పటికే బట్టల షాపులు, బంగారు షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేస్తే ఇన్నాళ్లూ ఉగ్గబట్టుకుని ఉన్నవాళ్లు సైతం ఎంట్రీ కోసం ఎగబడతారు. కరోనా సంగతి పక్కనపెడితే.. తిరిగి ప్రారంభిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లతో అనారోగ్య సమస్యలు తప్పవనేది నిపుణుల హెచ్చరిక.