న్యూస్ పేప‌ర్ పీడీఎఫ్ ఫార్వ‌ర్డ్ చేయ‌డం చ‌ట్ట రీత్యా నేరం!

వాట్సాప్ విస్తృతం అయ్యాకా జ‌నాల‌కు అబ్బిన వింత అల‌వాట్ల‌లో ఒక‌టి అడ్డ‌దిడ్డ‌మైన కంటెంట్ ను ఫార్వ‌ర్డ్ చేయ‌డం. ఒక చెత్త బుట్ట‌లోంచి మ‌రో చెత్త బుట్ట‌లోకి వేసినంత ఈజీగా కంటెంట్ ను ఫార్వ‌ర్డ్ చేస్తూ…

వాట్సాప్ విస్తృతం అయ్యాకా జ‌నాల‌కు అబ్బిన వింత అల‌వాట్ల‌లో ఒక‌టి అడ్డ‌దిడ్డ‌మైన కంటెంట్ ను ఫార్వ‌ర్డ్ చేయ‌డం. ఒక చెత్త బుట్ట‌లోంచి మ‌రో చెత్త బుట్ట‌లోకి వేసినంత ఈజీగా కంటెంట్ ను ఫార్వ‌ర్డ్ చేస్తూ ఉంటారు.

ఆ ఫార్వ‌ర్డ్ చేసే అంశాల్లో వాస్త‌విక‌త ఎంత‌, దాని న‌మ్మ‌డ‌మో-న‌మ్మ‌క‌పోవ‌డ‌మో వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాలు ఏమిట‌నే క‌నీస ఇంగిత జ్ఞానం లేకుండా వాట్సాప్ లో ఫార్వ‌ర్డ్ లు ఉంటాయి. ఒక్కోసారి ఈ ఫార్వ‌ర్డ్ లు న‌వ్విస్తుంటాయి. జ‌నాల ఎంత బుర్ర లేకుండా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారో అర్థం చేసుకోవ‌డానికి వాట్సాప్ ఫార్వార్డ్ లే నిద‌ర్శ‌నం.

గొర్రె దాటు గ‌మ‌నం అంటే ఏమిటో వాట్సాప్ లో ఫార్వ‌ర్డ్ అయ్యే మెసేజ్ ల‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ గొర్రెల‌ను కంట్రోల్ చేయ‌డానికి వాట్సాప్ నిర్వాహ‌కులు కూడా ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. గ్రూప్ మెసేజ్ లుగా ఫార్వ‌ర్డ్ అయ్యే వాటిని ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేస్తున్నాడు. ఇక క‌రోనా కాలంలో అయితే ఈ ఫార్వ‌ర్డ్ లు ప‌తాక స్థాయికి చేరాయి. గ్రూపుల్లో ఈ గోల భ‌రించ‌లేక‌.. కాస్త ఇంగితం ఉన్న వాళ్లు వాటి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు.

ఎవ‌రేమ‌నుకున్నా ఫ‌ర్వాలేద‌న్న‌ట్టుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇంగిత జ్ఞానం లేని వాళ్లు ఆ గ్రూప్ మెసేజ్ ల‌ను ఫార్వ‌ర్డ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇదే స‌మ‌యంలో.. వాట్సాప్ ద్వారా ఉద‌యాన్నే వార్తాప‌త్రిక‌ల‌ను గ్రూపుల్లోకి తోసేసే మేధావులు కొంద‌రు త‌యార‌య్యారు.

ఎవ‌రో వాళ్ల‌కు వాటిని ఫార్వ‌ర్డ్ చేస్తారు.  వీళ్లు ఆ ప‌త్రిక పీడీఎఫ్ ఫార్మాట్ ల‌ను తాము స‌భ్యులుగా ఉన్న ప్ర‌తి గ్రూప్ లోకి ప‌డేయ‌డం చేస్తూ ఉంటారు. ఇలా జాతిని ఉద్ధ‌రించేసిన‌ట్టుగా వీళ్లు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ.. వార్తా ప‌త్రిక‌ల‌ను పీడీఎఫ్ ఫార్మాట్ లో పోస్టో చేయ‌డం చ‌ట్ట రీత్యా నేరం. అది ఇన్ఫార్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ సెక్ష‌న్ 43 ప్ర‌కారం నేరం. 

డిజిట‌ల్ కంటెంట్ దాని ఓన‌ర్ ప‌ర్మిష‌న్ లేకుండా.. ఇలా ఫార్వార్డ్ చేయ‌డం, స‌ర్క్యులేట్ చేయ‌డం నేర‌మ‌ని సుప్రీం కోర్టు చేసిన చ‌ట్టం చెబుతూ ఉంది. ప‌త్రిక‌ల డిజిట‌ల్ ఎడిష‌న్ల‌పై ఎలాంటి హ‌క్కు లేని వాళ్లు వాటిని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వ‌ర్డ్ చేస్తూ ఉంటారు. ఈ మ‌హానుభావులు ఒక ప‌త్రిక కాదు.. అన్ని ప‌త్రిక‌ల‌నూ గ్రూపుల్లో ప‌డేస్తూ ఉంటారు. 

ఉచితంగా ప‌త్రిక ఇచ్చేస్తున్న‌ట్టుగా వీళ్లు ఫీల‌వుతూ ఉంటారు.  అయితే ప‌త్రిక‌ల‌ను కొనుక్కొని చ‌ద‌వ‌కుండా,  ఉచితంగా చ‌దివితే ఏమ‌వుతుందో.. *ప్రేమ‌కు వేళాయెరా* సినిమాలో ప్ర‌కాష్ రాజ్ పాత్ర చెబుతుంది. ఎమ్మెస్  నారాయ‌ణ ఫ్రీగా పేప‌ర్ చ‌దివడం గురించి ప్ర‌కాష్ రాజ్ ఒక క్లాస్ వేసుకుంటాడు.

ఈ వాట్సాప్ ఫార్వ‌ర్డ్ బ్యాచ్ కు కూడా అలాంటి క్లాస్ అవ‌స‌రం. అంతే కాదు.. ఈ ఫార్వ‌ర్డ్ చేసే వాళ్ల‌ను ఏ మీడియా సంస్థో ప‌ట్టుకుని కోర్టుకు ఈడిస్తే.. అప్పుడు త‌మ‌కు తెలియ‌చేసిన‌ట్టుగా మొత్తుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాబ‌ట్టి.. మీది కాని పేప‌ర్ ను పీడీఎఫ్ లో ఫార్వ‌ర్డ్ చేసే వాళ్లు కాస్త ఆలోచించుకోండి.

మళ్ళీ అదే ప్రశ్న