గాడ్సే నిజ‌మైన దేశ భ‌క్తుడుః నాగ‌బాబు

జాతిపిత మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరాంగాడ్సేపై మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు చేసిన ట్వీట్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. తీవ్ర వివాదాస్ప‌ద‌మైన ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో  ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సినీ న‌టుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్…

జాతిపిత మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరాంగాడ్సేపై మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు చేసిన ట్వీట్ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. తీవ్ర వివాదాస్ప‌ద‌మైన ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో  ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సినీ న‌టుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడైన‌ నాగ‌బాబు ట్వీట్ ఏంటో ముందు తెలుసుకుందాం.

“గాడ్సే నిజ‌మైన దేశ భ‌క్తుడు. గాడ్సే దేశ భ‌క్తిని శంకించ‌లేం.  గాంధీని గాడ్సే చంప‌డం త‌ప్ప‌…ఎలాంటి క్రిమిన‌ల్ హిస్ట‌రీ లేదు. గాడ్సే ఏ ప‌రిస్థితుల్లో చంపార‌నేది ఆలోచించాలి. గాడ్సే వాద‌న అప్ప‌ట్లో ఏ మీడియా చెప్ప‌లేదు. అప్ప‌టి మీడియా ప్ర‌భుత్వానికి లోబ‌డి ప‌ని చేసింది” అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

నాథూరాం జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నాగ‌బాబు ఈ ట్వీట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో భోపాల్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన ప్రగ్యాసింగ్ ఠాకూర్ కూడా నాగ‌బాబు చేసినట్టుగానే మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరాం గాడ్సే నిజ‌మైన దేశ‌భ‌క్తుడంటూ వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఆమె వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బీజేపీ అధిష్టానం సీరియ‌స్ కావ‌డంతో ఆమె త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె ఆ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొంద‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీలో బిర్లా నివాసంలోని ప్రార్థ‌నా స‌మావేశ మందిరానికి వెళుతున్న మ‌హాత్మాగాంధీని 1948, జ‌న‌వ‌రి 30న నాథూరాంగాడ్సే తుపాకీతో పాయింట్ బ్లాక్‌లో మూడుసార్లు కాల్చాడు. ఈ కాల్పుల్లో ఆ మ‌హ‌నీయుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. జాతిపిత‌గా దేశ‌మంతా ఆరాధించే మ‌హాత్మాగాంధీని చంపిన గాడ్సే అంటే దేశం అస‌హ్యించుకుంటుంది. అలాంటి గాడ్సే దేశ భ‌క్తుడంటూ నాగ‌బాబు తీవ్ర వివాదాస్ప‌ద ట్వీట్ చేయ‌డం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావ‌డం లేదు.

కానీ బీజేపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న త‌ర్వాత ప‌వ‌న్‌తో స‌హా ఆ పార్టీ నాయ‌కుల మాట‌ల్లో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. బీజేపీ భావ‌జాలాన్ని జ‌న‌సేన భుజాన వేసుకుని ఊరేగుతూ ఢిల్లీ పెద్ద‌ల మెప్పుకోసం వెంప‌ర్లాడ‌టాన్ని చూస్తున్నాం.  బీజేపీకి చెందిన చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు గాడ్సే గొప్ప దేశ‌భ‌క్తుడంటూ ప‌లు సంద‌ర్భాల్లో కీర్తించారు. అంత‌టితో ఆగ‌కుండా గాంధీని విమ‌ర్శించారు. బీజేపీ నేత‌ల‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తితే…ఆ త‌ర్వాత త‌మ వ్యాఖ్య‌లు ఉప‌సంహరించుకుంటామ‌ని చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా గాడ్సేపై త‌న ట్వీట్‌ను నాగ‌బాబు ఏ విధంగా స‌మ‌ర్థించుకుంటారో చూడాలి.

-సొదుం

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష