కశ్మీర్ అంశంపై భారతీయ, పాకిస్తానీల మధ్యన మాటల యుద్ధం సాగుతూ ఉంది. కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడం పట్ల పాకిస్తాన్ స్పందిస్తోంది. కశ్మీర్ కు సాయం చేయడానికి తము రెడీ అన్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. అలా భారత అంతర్గత వ్యవహారంలోకి చొరబడే ప్రయత్నం సాగించారు.
ఇక ఈ అంశంలో తెగ రియాక్ట్ అయిపోయిన వారిలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిదీ కూడా ఉన్నాడు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అతడు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి స్పందించేయలన్నట్టుగా అఫ్రిదీ స్పందించాడు.
ఆ క్రికెటర్ ట్వీట్లపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న మాట వాస్తవమే అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్లో అని అన్నాడు. పీవోకేలో పాకిస్తాన్ అకృత్యాలకు పాల్పడుతూ ఉందని, వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఆ విషయంలో ఐక్యరాజ్యసమితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు స్పందించాలన్నాడు. అఫ్రిదీ బాధపడాల్సిన అవసరం లేదని, పీవోకే మీద కూడా భారత్ దృష్టి పెడుతుందని గంభీర్ చురకలంటించాడు.