తన అధినేత చంద్రబాబునాయుడి ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్త ఎత్తు ఆటకు తెరలేపారు. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకున్న చందంగా, గత కొంత కాలంగా విశాఖ ఉక్కును సాకుగా తీసుకుని గంటా వైసీపీని దెబ్బ తీయడంతో పాటు టీడీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను తిరుపతి ఉప ఎన్నికలో రగిల్చి తద్వారా టీడీపీకి ప్రయోజనం కలిగించే సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టిన విషయం శనివారం బయట పడింది.
తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ … తిరుపతి ఉప ఎన్నికలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం తరపున ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అఖిలపక్షంతో చర్చిస్తా మన్నారు.
అఖిలపక్షం తరపున నిలిచిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడినట్టు, లేదంటే ఏపీ ద్రోహులుగా చిత్రీకరించే కుట్రలకు గంటా నేతృత్వంలో తెరలేచినట్టు అర్థమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగా స్తబ్ధుగా ఉన్న గంటా శ్రీనివాసరావు …విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంపై తెరపైకి రాగానే, తన పదవికి రాజీనామాతో క్యాష్ చేసుకునేందుకు చురుగ్గా పావులు కదపడం గమనార్హం.
ఎటూ విశాఖ ఉక్కు ఉద్యమంలో వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. టీడీపీతో సీపీఐ ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
గంటా చెబుతున్నట్టు అఖిలపక్షం తరపున అభ్యర్థి అంటే టీడీపీ -సీపీఐ కూటమి అభ్యర్థే అని అర్థం చేసుకోవాలి. పేరుకు అఖిలపక్షం …ప్రయోజనాలు మాత్రం టీడీపీ పక్షం అనే రీతిలో గంటా పావులు కదుపుతున్నారు. అయితే గంటాను ముందుకు పెట్టి చంద్రబాబు ఆడిస్తున్న ఆటగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.