ఇన్నాళ్లూ మంచి అదను కోసం ఎదురుచూశారు. ఏమాత్రం పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నా జంప్ కొట్టేయాలని చూశారు. కానీ ఊహించని విధంగా గంటా శ్రీనివాసరావుకు ఓ చిక్కొచ్చిపడింది. ఈసారి ఆయన ఎలా వ్యవహరిస్తారనేదానిపై అతడి రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది.
మరికాసేపట్లో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లు సభలోకి రానుంది. దీనికి పరిపాలన-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అని పేరుపెట్టారు. ఈ బిల్లు కనుక సభలోకి వస్తే ఓటింగ్ కు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. సరిగ్గా ఇక్కడే గంటా ఇరుక్కున్నారు.
నిజంగానే అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే గంటా ఎటువైపు ఉన్నారనేది స్పష్టంగా తేలిపోతుంది. బాబు చెప్పినట్టు మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. ఉత్తరాంధ్రలో గంటా రాజకీయ జీవితం భూస్థాపితం అయినట్టే. అంతేకాదు.. ఆయనకు ఇలా వైసీపీ నుంచి తలుపులు మూసుకుపోయినట్టే. అలా అని బాబును వ్యతిరేతిస్తూ, విప్ ను ఉల్లంఘిస్తూ మూడు రాజధానుల అంశానికి మద్దతుగా ఓటేస్తే.. టీడీపీ నుంచి వేటు ఖాయం.
వ్యతిరేకంగా ఓటు వేస్తే చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని స్పీకర్ ను కచ్చితంగా కోరుతుంది టీడీపీ. నిజానికి ఇలా ఓటింగ్ కు వెళ్లాలనే ఆలోచన వెనక టీడీపీ వ్యూహం కూడా ఇదే. ఎందుకంటే, తన పార్టీలోనే ఉంటూ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ పై చర్యల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది. అందుకే సభలో మెజారిటీ లేకపోయినా ఈ డ్రామాకు తెరదీసింది. ఇదిప్పుడు గంటా మెడకు చుట్టుకుంది.
ఇక గంటా నాన్చలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గంటా ఆ గట్టునుంటారా.. ఈ గట్టుకొస్తారా అనే విషయం తేలిపోయే అవకాశం ఉంది.