విశాఖ ఉద్య‌మానికి గంటా గంత‌లు

మీడియా అటెన్ష‌న్ కోసం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తిప్ప‌లు ప‌డుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ఇదే…

మీడియా అటెన్ష‌న్ కోసం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తిప్ప‌లు ప‌డుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ఇదే స‌రైన స‌మ‌య మ‌ని గంటా శ్రీ‌నివాస‌రావు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అయితే గంటా వేసే ప్ర‌తి అడుగు వెనుక ఉద్దేశాల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మ‌కారులు ప‌సిగ‌డుతున్నారు. విశాఖ స్టీల్ పేరు చెప్పి సొంత ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చుకోవాల‌నే త‌లంపుతో శ్రీ‌నివాస‌రావు ప్ర‌ముఖుల‌ను క‌లుస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మాన్ని తానే న‌డిపిస్తున్న‌ట్టు ఆయ‌న క‌ల‌రింగ్ ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌శాఖ‌ల మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. ఈ భేటీకి సంబంధించిన స‌మాచారాన్ని గంటా అనుచ‌రులు మీడియాకు ఓ ప్రెస్‌నోట్  పంపారు. అయితే ఎక్క‌డా గంటా చెప్పిన‌ట్టు కాకుండా, మీడియా త‌న‌కు తానుగా రాసిన‌ట్టు టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీఆర్ఎస్ అనుబంధ వార్తా ప‌త్రిక వెబ్‌సైట్‌లో కూడా అక్ష‌రం కూడా పొల్లు పోకుండా ఒకే ర‌క‌మైన వార్త‌ను  క్యారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మానికి కేటీఆర్ మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపిన కేటీఆర్‌కు గంటా కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఉద్య‌మం అంటే స‌మూహానికి సంబంధించింది. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అడ్డు పెట్టుకుని వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను పొందాల‌నే గంటా దురుద్దేశాల‌ను విశాఖ ఉద్య‌మ‌కారులు గుర్తించ‌లేని స్థితిలో లేరు.

నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మంపై గంటాకు చిత్త‌శుద్ధి ఉంటే …ఒక్క‌డిగా వెళ్లి కేటీఆర్‌ను క‌ల‌వ‌డం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మం టీడీపీకో లేదా గంటా వ్య‌క్తిగ‌త అంశానికో సంబంధించింది కాదు క‌దా? అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాలంటే వ్య‌క్తిగ‌తంగా తిరుగుతూ ప్ర‌చారం పొంద‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు, సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేటీఆర్‌తో భేటీ వెనుక మ‌రేవో ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌నే వాళ్లు లేక‌పోలేదు.  పిల్లి పాలు తాగుతూ త‌న‌నెవ‌రూ చూడ‌లేద‌నుకున్న రీతిలో గంటా వ్య‌వ‌హార శైలి ఉంది. విశాఖ స్టీల్ ప్టాంట్ ఉద్య‌మానికి గంటా గంత‌లు క‌ట్టే ప్ర‌య‌త్నాల్ని అంద‌రూ క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నారు.