కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య గ్యాప్‌నకు సంబంధించి తాజా అధ్యయనం చెప్పేది వింటే ఆశ్చర్యం కలుగుతోంది. రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే, రోగ నిరోధకత మరింత మెరుగ్గా ఉంటుందని సదరు పరిశోధన ఫలితం చెబుతోంది.
మొదట్లో టీకాల మధ్య గ్యాప్ నాలుగైదు వారాలని చెప్పారు. ఆ తర్వాత 12 నుంచి 16 వారాలుగా నిర్ణయించారు. ప్రస్తుతం దీని ప్రకారమే వ్యాక్సినేషన్ ప్రక్రియ మన దేశంలో సాగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఒక్కో పరిశోధన ఒక్కో రకంగా వ్యాక్సినేషన్‌పై ఫలితాలు రావడం గమనార్హం. మరీ ముఖ్యంగా మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయిలు బాగా వృద్ధి చెందుతాయని సదరు పరిశోధన సంస్థ నిగ్గు తేల్చడం విశేషం. 18-55 ఏళ్ల మధ్య వయసున్న వాలంటీర్లపై బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించిన తాజా ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ అధ్యయనం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
కొవిషీల్డ్ ఫస్ట్ డోసును తీసుకున్నాక కనీసం ఏడాది వరకు వ్యక్తుల్లో యాంటీబాడీల స్థాయులు అధికంగా ఉంటున్నాయి. 12 వారాల విరామంతో రెండు డోసులను తీసుకున్నవారితో పోలిస్తే.. 45 వారాల (దాదాపు 11 నెలలు) వ్యవధితో రెండో డోసును పొందినవారిలో యాంటీబాడీ స్థాయులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రెండో డోసు (11 నెలల విరామంతో) తీసుకున్న 28 రోజుల తర్వాత యాంటీబాడీ స్పందన 18 రెట్లు పెరుగుతోంది.
అంతేకాదు, రెండో డోసు తర్వాత ఆరు నెలల విరామంతో మూడో డోసు తీసుకుంటే.. యాంటీబాడీ స్థాయులు ఆరు రెట్లు అధికమవుతున్నాయి. ఈ ఫలితాలపై మరింత లోతుగా పరిశోధన జరిపితే … అంతిమంగా వచ్చే ఫలితాలను బట్టి డోసు తీసుకోవడంపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
మొత్తానికి ఎంత ఆలస్యమైతే అంత మంచిగా పనిచేస్తుందని కోవిషీల్డ్ టీకాపై తాజా అధ్యయనం చెబుతోంది. ఏది ఏమైతేనేం పరిశోధనలు మాత్రం టీకాలకు గ్యాప్‌ను బాగా పెంచుతున్నాయనేది నిజం.