కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్ట్ గోపీని బలి తీసుకుంది. ఇప్పటికే కరోనా పదుల సంఖ్యలో జర్నలిస్టుల ఉసురు తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం గోపి కన్ను మూశారన్న వార్త జర్నలిస్టు రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సాక్షి చానల్లో ‘గరం గరం వార్తలు’ బాగా పాపులర్. ప్రముఖ యాంకర్, నటుడు బిత్తిరి సత్తితో కలిసి కార్యక్రమాన్ని పంచుకునే గోపి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు.
ఎంతో భవిష్యత్ ఉన్న గోపిని కరోనా మహమ్మారి చిదిమేసింది. గోపిది స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. కరోనా బారిన పడిన ఆయన వారం రోజులుగా మదనపల్లెలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కరోనాపై పోరాటంలో ఆయన అలసిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున చివరి శ్వాస తీసుకున్నాడు. చిత్తూరు యాసలో ఆయన మాటలు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేవి.
సందర్భోచితంగా, పాత్రోచితంగా ఆయన మాట్లాడే తీరు ఎంతో మంది అభిమానులను తెచ్చి పెట్టింది. గోపి మృతి జర్నలిజానికి తీరని లోటని జర్నలిస్టు నేతలు నివాళులర్పించారు.