‘కడప రౌడీలు, రాయలసీమ సంస్కృతి విశాఖకు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. విశాఖ ప్రజలు చాలా సౌమ్యులు. ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూములను కొల్లగొడదామని కొందరు వస్తున్నారు’ అని విశాఖకు పరిపాలన రాజధాని అనగానే ఎల్లో బ్యాచ్ సరికొత్త వాదనకు తెర లేపిన విషయం తెలిసిందే. మరి ‘గీతం’ భూబాగోతం మాటేమిటి? ఇది ఎవరి సంస్కృతి? అనే ప్రశ్నలు వెల్లు వెత్తుతున్నాయి.
గీతం యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా 40.51 ఎకరాలను ఆక్రమించింది. దీని విలువ రూ.800 కోట్లు అని చెబుతున్నారు. వందల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టి …రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి భూముల్ని ఆక్రమించుకుంటారని విమర్శలు చేయడం టీడీపీకే చెల్లింది. గీతం వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ సీనియర్ నాయకులు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు.
ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ‘గీతం’ ఆక్రమించుకుని విద్యాబుద్ధులు చెబుతున్నామని దర్జాగా నీతి వాక్యాలు వల్లె వేయడం వారికే చెల్లింది. విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి అంతా టీడీపీ పాలైందనే విమర్శలు లేకపోలేదు. దీనికి గీతం ఆక్రమించిన ప్రభుత్వ భూమే నిదర్శనం.
ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించడం, అధికార అండతో కాపాడుకుంటూ రావడం గీతం వర్సిటీకి పరిపాటైంది. జగన్ సర్కార్ దెబ్బతో వాళ్ల ఆటలు సాగలేదు. ఇంతకాలం ప్రభుత్వ భూములు రాయలసీమ రౌడీల పాలిట అన్యాక్రాంతమవు తున్నాయని గగ్గోలు పెట్టిన పచ్చ బ్యాచ్ … గీతం ఆక్రమణలపై ఏనాడూ నోరు తెరిచిన పాపాన పోలేదు. పైగా ఆక్రమణలను తొలగిస్తే కూల్చివేతలంటూ పెడబొబ్బలు పెట్టడం వారికే చెల్లింది.
పచ్చ బ్యాచ్ మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదు. అందువల్లే గీతం ఎపిసోడ్‌లో పచ్చ బ్యాచ్ అభాసుపాలైంది. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. భూదాహంతో ప్రభుత్వ భూమిని ఎక్కడికక్కడ ఆక్రమించిన పచ్చ బ్యాచ్‌కు రాయలసీమ వాళ్లు అట్లే కనిపిస్తారనే విమర్శలు లేకపోలేదు.