ఏపీలో ఉద్యోగుల జీతాలకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్ర ఖజానాలోని సొమ్మంతా సంక్షేమ పథకాల అమలుకే సరిపోతోందనే విమర్శలున్నాయి. ఇక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఏ నెలాకానెల వెతుక్కునే దయనీయ స్థితి. దీంతో ఒకటో తేదీకల్లా ఉద్యోగులకు అందాల్సిన జీతాలు …ఇప్పుడు ఆలస్యమవుతున్నాయి. ఖజానాలో డబ్బు వెసలుబాటు అనుగుణంగా విడతల వారీగా కొన్ని డిపార్ట్‌మెంట్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు ఇస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ రోజు (గురువారం) ఎట్టకేలకు జీతాలు అందాయి. దీంతో ఉపాధ్యాయులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక భయాన్ని జగన్ ప్రభుత్వం క్రియేట్ చేయగలిగింది. ఇకపై ఇదే విధంగా అలస్యంగా జీతాలు అందించే సంప్రదాయానికి ప్రభుత్వం ఈ నెల నుంచి శ్రీకారం చుట్టిందేమోననే భయం, అనుమానం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకపోలేదు.
గతంలో చంద్రబాబు హయాంలో రెండుమూడు సందర్భాల్లో ఐదారు తేదీల్లో జీతాలు అందాయని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. అప్పట్లో మోడీ సర్కార్‌తో చంద్రబాబు సఖ్యతగా ఉంటూ, ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా నెట్టుకొచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం తమను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదనే ఆవేదన ఉద్యోగుల్లో బలంగా నాటుకుంది.
ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో కచ్చితంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. తద్వారా అంతిమంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించక తప్పదు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు ఉద్యోగుల జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అలా కాకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.