కరోనా మహమ్మారి మనుషుల్నే కాదు…ఏ ఒక్క దాన్ని వేధించకుండా విడిచి పెట్టడం లేదు. దీనికి గూగుల్ కూడా మినహాయింపు కాదు. అంతేకాదు, కరోనాతో అత్యధిక వేధింపునకు గురవుతున్నదేదైనా ఉందంటే…అది ఒక్క గూగుల్ మాత్రమే. ఇంటర్‌నెట్ వాడుకలోకి రావడంతో ఏ అంశంపైనైనా సమాచార సేకరణ సులభమైంది.
ఒక్క మాటలో చెప్పాలంటే అరచేతిలోనే సమాచారం వచ్చి పడింది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు…ప్రపంచ విజ్ఞానం అరచేతిలో ఉన్నట్టే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది. అసలు కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎక్కడ నుంచి ఎలా వ్యాపించింది? దాని లక్షణాలేమిటి? అది ఏ స్థాయి ప్రమాదకారి? ప‌్రపంచ వ్యాప్తంగా ఎంత మంది ప్రాణాలు తీసింది? కరోనాకు మందు కనుక్కున్నారా? ఈ మహమ్మారికి ముగింపు ఎప్పుడు? తదితర సవాలక్ష అనుమానాలు, ప్రశ్నలతో గూగుల్ సెర్చ్ తల బొప్పి కడుతోంది.
కరోనా వైరస్ బలహీన పడుతోందా? భారత్‌లో కరోనా వాక్సిన్ ఎప్పుడు వస్తుంది? తదితర ప్రశ్నలను జూన్ నెలలో భారతీయ నెటిజన్లు ఎక్కువగా వెతికినట్టు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ వెల్లడించింది. జిహ్వకో రుచికి, పుర్రెకో బుద్ధి అన్నట్టు ఎవరికి తోచినట్టు వాళ్లు తమ సందేహాలకు సమాధానాల కోసం గూగుల్‌ను ఆశ్రయించినట్టు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ తెలిపింది.