ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి టీడీపీ తోటే ప్రయాణం చేసిన సీనియర్ నేత, పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడిపోతున్నారు. ఇదేదో సాక్షిలో వచ్చిన రూమర్ అనుకుంటే పొరపాటే.. చంద్రజ్యోతిలో వచ్చిన అధికారిక సమాచారం. అవును, ఆయన త్వరలో పార్టీకి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారట.
బాబు-లోకేష్ పై కోపం..
మాజీ మంత్రి, పైగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్.. రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలిని సైతం తట్టుకుని టీడీపీ తరపున గెలిచిన అతికొద్దిమంది నేతల్లో ఒకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తరపున వినిపించిన అతికొద్ది గొంతుల్లో బుచ్చయ్య గొంతూ కూడా ఉంది. కానీ ఆ గొంతు ఇటీవల కొన్నాళ్లుగా మూగబోయింది. బాబు పెట్టే జూమ్ మీటింగ్ లకు కూడా డుమ్మా కొట్టింది. పార్టీ కార్యకలాపాలలో కూడా చురుగ్గా ఉండటం లేదు.
దీంతో ఏదో జరుగుతోందని అందరూ అనుకునే లోపే ఆయన సన్నిహితుల వద్ద బాంబు పేల్చారు. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని, చినబాబు తనలాంటి సీనియర్లకు సైతం మర్యాద ఇవ్వడంలేదని, తన ఫోన్లు కూడా వారు లిఫ్ట్ చేయడం లేదని గోరంట్ల చాన్నాళ్లుగా బాధపడుతున్నారట. ఇంకా టీడీపీలోనే ఉంటే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని చెబుతున్న ఆయన, పార్టీని, పదవిని కూడా వీడేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో రాజీనామాలపై ఆయనే ప్రకటన చేస్తారని, కాదు కాదు.. ఏకంగా రాజీనామాయే చేస్తారని అంటున్నారు.
ఆ నలుగురి కంటే ఓ అడుగు ముందుకే..
ఇప్పటికే టీడీపీ నుంచి నలుగరు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వెళ్లారు. కానీ వారెవరూ పార్టీకి, పదవులకు రాజీనామా చేయలేదు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్.. వీరంతా తమ కుటుంబ సభ్యుల్నో, సన్నిహితుల్నో జగన్ వద్దకు తీసుకెళ్లి కండువా కప్పించి, తాము గ్రూప్ ఫొటో దిగి జై జగన్ అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం వీరు ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలే.
అయితే వీరికంటే ఓ అడుగు ముందు వేయబోతున్నారట బుచ్చయ్య. పార్టీకీ, పదవికి రాజీనామా చేసి.. వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. జగన్ వద్దకు వెళ్లేందుకు ఇగో అడ్డొస్తే.. ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయట. ఆయన ఏ కండువా కప్పుకున్నా.. అర్జంట్ గా పచ్చ కండువా మాత్రం మెడలో నుంచి తీసేయడం మాత్రం ఖాయమట.