ఆ మూడు విషయాల్లో జగన్ జాగ్రత్త

వైఎస్ జగన్ ను కార్నర్ చేయడానికి తెలుగుదేశం, దాని మూలాల్లో దాగిన సామాజికవర్గం చేసే ప్రచారం చేసే విషయాలు కొన్ని వున్నాయి. జగన్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం పునాదులపై ఏర్పడింది. రెడ్లే దాన్ని…

వైఎస్ జగన్ ను కార్నర్ చేయడానికి తెలుగుదేశం, దాని మూలాల్లో దాగిన సామాజికవర్గం చేసే ప్రచారం చేసే విషయాలు కొన్ని వున్నాయి. జగన్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం పునాదులపై ఏర్పడింది. రెడ్లే దాన్ని మోస్తున్నారు.

జగన్ అవినీతి పరుడు. జైలుకు వెళ్లి వచ్చాడు.
జగన్ క్రిస్టియన్. హిందూ వ్యతిరేకి, తిరుమల గుడిలోకి చెప్పులతో వెళ్లాడు. (ఇది సాధ్యమా? అని కూడా ఆలోచించరు, పవన్ కళ్యాణ్ లాంటి మేధావులు కూడా).
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ ఈ మూడు విషయాలు మదిలో పెట్టుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది.

అవినీతి రహిత పాలన అందిస్తా అని డే వన్ నుంచి చెప్పుతూ వస్తున్నాడు. అందుకే తనపైన ఈగవాలకుండా, జ్యూడిషియల్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసి టెండర్లు, కాంట్రాక్టర్ల వ్యవహారం దానికి అప్పగించే పని చేపట్టారు. తన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అవినీతి విషయంలో ముందే హెచ్చరించాడు. ఇక క్రిస్టియానిటీ సంగతి. గత అయిదేళ్లలో రెండు మూడుసార్లు జగన్ తిరుమల వెళ్లాడు. పాదయాత్రకు ముందు, తరువాత, సిఎమ్ కాగానే మరోసారి. అలాగే హిందూ స్వామీజీ స్వరూపానంద నేతృత్వంలో అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సిఎమ్ కాగానే అదే స్వామీజీని కలిసి, నమస్కరించి వచ్చాడు.

ముచ్చటగా మూడో విషయం. రెడ్డి సామాజిక వర్గం. జగన్ సిఎమ్ కాగానే కొందరు అధికారులను నియమించేసరికి తెలుగుదేశం హయాంలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ను కావాలని మరచిపోయి కూడా హడావుడి స్టార్ట్ చేసారు. మంత్రివర్గంలో కనీసం ఏడెనిమిది మంది రెడ్డి సామాజిక వర్గ జనాలు వుంటారని అందరూ ఊహాగానాలు చేసారు. ఎందుకుంటే వైకాపాకు వున్న 151 మంది ఎమ్మెల్యేల్లో యాభైకి పైగా రెడ్లు వున్నారు.

కానీ వాళ్లకు షాక్ ఇచ్చేలా కేవలం నలుగురికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చాడు. ఎస్సీలకు రెడ్లకన్నా ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు. తెలుగుదేశం తమది బిసిల పార్టీ అని చెప్పుకుంటుంది. కానీ జగన్ బిసిలకు పెద్ద పీట వేసారు. అదే విధంగా కాపులకు సముచిత స్థానం ఇచ్చారు. సామాజిక సమతూకం పక్కాగా వుండేలా చూసుకున్నారు. వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు కూడా అవకాశం కల్పించారు.

మొత్తంమీద మూడు విషయాల్లో తనను విమర్శించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేయడం అన్నది జగన్ ఆలోచనగా క్లియర్ గా కనిపిస్తోంది. అదే సమయంలో అధికారులకు అధికారాలు ఇచ్చి, వారి చేత పాలన సాగించాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, మంత్రి పదవులు నామమాత్రమే అని, జగన్ తో అధికారుల ద్వారా సాగేపాలనే భవిష్యత్ లో వుంటుందని తెలుస్తోంది.

మొత్తంమీద జగన్ బాగానే జాగ్రత్త పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, దాని మూల సామాజిక వర్గ జనాల సంగతి బాగానే అర్థమైపోయినట్లుంది జగన్ కు. కానీ ఒక్కటే సమస్య వుంది. ఫుల్ పాజిటివ్ ఫోర్స్ వున్నంతకాలం ఇలాంటి వ్యవహారాలు బాగానే వుంటాయి. చాపకింద నీరు వ్యవహారాలు వుండనే వుంటాయి. వాటి విషయంలో జగన్ జాగ్రత్తగా వుండాలి.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?