మహానాడు విజయవంతమైందనే ఆనందం తెలుగుదేశం పార్టీకి ఎంతో సేపు నిలవలేదు. సీనియర్ నటి, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ ఆ పార్టీని ఇబ్బందికి గురిచేసింది. టీడీపీలో అవకాశాలు రావాలంటే ఏం చేయాలో చెప్పడానికి సంస్కారం అడ్డొస్తుందని దివ్యవాణి …అసలేం జరుగుతున్నదో చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తమకు అన్యాయం జరిగిందని…. సాధినేని యామినీ శర్మ, దివ్యవాణిలా ఇంకా ఎవరెవరు గళం విప్పుతారనే చర్చ సర్వత్రా సాగుతోంది.
ముఖ్యంగా పలువురు మహిళల పేర్లు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా దివ్యవాణిలా నోరెత్తకుండా ఎలా కట్టడి చేయాలనే ఆలోచన ఇప్పటి నుంచే ఆ పార్టీ ముఖ్యులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు మహిళా నాయకురాళ్లు, అలాగే రాయలసీమ నుంచి మరో ఇద్దరు మహిళా నాయకురాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
వీళ్లంతా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారే కావడం విశేషం. రాయలసీమలో ఇప్పటికే సదరు మహిళా నాయకురాలిని పక్కన పెట్టి, మరో నాయకుడిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. సీమలో పెద్ద నాయకుడిపై పోటీ చేసి, అన్ని రకాలుగా నష్టపోయిన తనను కాదని, మరొకరిని ఇన్‌చార్జ్‌గా నియమించడంపై ఆమె గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సమయం చూసి తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
అలాగే రాయలసీమకే చెందిన మరో యువనాయకురాలిని కూడా టీడీపీ ఎలా అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం ఉన్న ఆ నాయకురాలికి చిన్న వయసులోనే మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినా, నమ్మకాన్ని నిలబెట్టుకోలేదనే అభిప్రాయంతో టీడీపీ అధిష్టానం ఉంది. ఆమెకు టికెట్ ఇస్తే, ప్రత్యర్థి సులువుగా గెలుస్తాడని టీడీపీ సర్వేలో తేలినట్టు సమాచారం. దీంతో సదరు నాయకురాలికి వరుసకు అన్నయ్యే నాయకుడిని తెచ్చుకునేందుకు పార్టీ సిద్ధమైనట్టు సమాచారం. ఇదే జరిగితే ….నోరున్న ఆ యువ మహిళా నాయకురాలు ఎలా స్పందిస్తారో అనే ఆందోళన పార్టీని పీడిస్తోంది.
ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి ఇద్దరు నాయకురాళ్లు టికెట్ కోసం పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. వీరిలో ఒకామెకు పార్టీలో పెద్ద పదవే ఇచ్చారు. ఇదే ఆమెకు ఎక్కువనే అభిప్రాయంతో చంద్రబాబు, లోకేశ్ ఉన్నట్టు సమాచారం. అప్పులు తీసుకోవడం, ఎగ్గొట్టడం, పార్టీ పేరు దుర్వినియోగం చేస్తూ, కేడర్, లీడర్స్‌కు దూరమైందనే వాస్తవాన్ని టీడీపీ అధిష్టానం ఆలస్యంగా గుర్తించింది. అయితే అందంతో పాటు గట్టిగా మాట్లాడే చొరవ వుండడంతో , పార్టీ అవసరాల రీత్యా ప్రోత్సహిస్తోంది. అలాగని టికెట్ ఇస్తే, అసలుకే ఎసరు వస్తుందనే భయం లేకపోలేదు.
ఇక మరో నాయకురాలు… ఇటీవల తొడగొట్టి అందరి దృష్టిలో పడ్డారు. లండన్‌లో చదువుకున్నానని, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటున్న నాయకురాలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు, లోకేశ్ ఆలోచనలు వేరుగా వున్నాయి. గెలుపొక్కటే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. సుదీర్ఘకా లంగా టీడీపీలో ఉంటున్న కేఈ కుటుంబాన్ని పక్కన పెట్టి, డోన్‌లో కొత్త వ్యక్తికి టికెట్ ప్రకటించిన వైనాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది.
అధినేతల దృష్టిలో పడేందుకు ప్రత్యర్థులపై తొడగొడుతూ, లేని మీసాల్ని తిప్పుతూ, ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్న మహిళా నాయకురాళ్లు… తమకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? అనేది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో.