cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు అండ్‌కోకి ఠారెత్తించే అసెంబ్లీ సమావేశాలు

బాబు అండ్‌కోకి ఠారెత్తించే అసెంబ్లీ సమావేశాలు

25 ఎంపీ సీట్లు ఒక్కటి పోకుండా అన్నీ గెలుచుకుంటామని మే 22వరకు చంద్రబాబు దిక్కులు పిక్కటిల్లేలా కూతలతో జనాలను సంభ్రమంలో ముంచారు. కానీ, ఫలితాల్లో కేవలం ముగ్గురే గెలిచారు. అందులో ఇద్దరు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌లను బాబు గతిలేక వారికి లోక్‌సభలో పార్టీ పదవులిచ్చారు. ఆమద్య మిష్టర్‌ ప్రైమ్‌మినిష్టర్‌ అని చట్టసభలో ప్రధాని మోదీని వేలెత్తి చూపి ఉపన్యసించినందుకు గల్లాను, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో కలిపికొట్టు కావేటిరంగా అని ప్రసంగించే రామ్మోహన్‌లను సభలో పార్టీతరుపున నేతలుగా చేసారు. మూడోఎంపీ కేశినేని నానికి విప్‌గా సభలో ఉండవయ్యా అని ఆయన నెత్తినరుద్దారు. నేనుండనయ్యా! చంద్రయ్యా! అని నాని తన ఫేస్‌బుక్‌లో ఆక్రోశాన్ని బహిర్గతం చేసారు. దాంతో అసలే మీడియా పిచ్చకు పరాకాష్టలాంటి టీడీపీలో చెడామడా భుజాలు తడుముకున్నారు. అప్పుడే నాని ఎత్తిపొడుపుగా బాబుతో ప్రవర్తిస్తున్నారని క్యాడర్‌ అతలా కుతలం అయిపోయింది. అసలే బాబు తన కారణంగా పార్టీ దారుణమైన ఓటమితో చేష్టలుడిగి దీనంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలా తిరుగుబాటు బావుటా ఎగరేయడం కేశినేనికి పాడిగాదని చాలామంది తమబాధను వ్యక్తంచేసారు. పైగా, బీజేపీలోకి నాని జంప్‌ చేస్తారని, ఈ మేరకు బీజేపీ మూలవిరాట్టుల్లో ఒకరితో నాని టచ్‌లో ఉన్నారని కూడా టాక్‌ ఒకటి తుమ్మెద ఝంకారాలు చేస్తోంది.

దీనికితోడు బాబుతో వివిధ విషయాలపై చర్చించేందుకు పార్టీలో తెగిపోయిన టిక్కెట్లు ఏదో గెలిచామన్నట్లు గెలిచినోళ్లు బాబు ఇంట కొలువుతీరారు. తెలంగాణాకు ఏపీ అసెంబ్లీ భవనాలు అప్పగించడానికి జగన్‌ ఏకపక్ష నిర్నయంపై అసెంబ్లీలో నిలదీద్దామని ఒకరిద్దరు ఒంటి కాలిపై లేచారు. అంతవరకు ఓటమి వైరాగ్యంతో కళాకాంతులు కోల్పోయి నట్లున్న బాబు ఉలిక్కిపడ్డారు. ఆ భవనాల  కోసం అడగొద్దు. ఇప్పుడిప్పుడే కొత్తసర్కారుపై తొందరపడొద్దు. కొన్నాళ్లు జగన్‌ పాలన చూద్దాం. జగన్‌ జనాల్లో చెప్పిన హమీలు అన్నీ అమలు అయ్యేలా స్పందిద్దాం అని  వారికి సర్ధిచెప్పారు. అది విన్న తెలుగుతమ్ముళ్లు బాబు ఉలికిపాటులో ఆంతర్యం గ్రహించేసారు. మహారాజా భవనాల్లాంటి ఏపీ భవనాలను దేశంలో అద్భుతనగరమైన హైద్రాబాద్‌ను వదిలేసి రాత్రికి రాత్రి అమరావతికి పరుగులు తీసిన బాబు ఉత్తరకుమారుని తీరు గుర్తుకు తెచ్చుకున్నారు.

ఓటుకునోటు కేసులో పక్కాగా చట్టానికి చిక్కిన చంద్రన్నను కేసీఆర్‌ అరెస్టు చేయిస్తాననే వరకు హడావుడి చేసారు తెలంగాణా సీఎం కేసీఆర్‌కు నోటిబూకరం ఎక్కువే. ఆయన ప్రత్యర్ధులపై విమర్శలు నరాలు మెలిపెట్టేలా ఉంటాయి. ఇక చేతల్లో అంతకుమించి ఉంటారనే బితుకుతో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రన్న అమరావతికి పారిపోయారు. అక్కడే ఏపీ రాజధాని నిర్మాణానికి నడుం బిగించారని మీడియాలో కథనాలు వరుసగా టీడీపీనేతలు గుర్తుతెచ్చుకున్నారు. అందుకే, తెలంగాణాకు నిరుపయోగంగా ఉన్న ఏపీ భవనాలు అప్పగింతపై జగన్‌ ఏకపక్ష నిర్ణయం కూడదని అసెంబ్లీలో ప్రస్తావనకు ఎంతమాత్రం బాబు సిద్ధంగా లేరని తెలుగు తమ్ముళ్లు ఇట్టే గ్రహించేసారు. బాబును కలిసిన గుంపులో ఉన్న యనమల రామక్రిష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ లాంటి నేతలు కూడా బాబు భయం పసిగట్టేసారు. కానీ, స్వంతానికి గెలిచేశక్తిలేని ఇలాంటి నేతలు బాబుకు కైవారాలు చేసి రాజకీయాల్లో సాగాల్సిందే. బాబు ముందు కిక్కురుమనే పరిస్థితి చాలావరకు టీడీపీ నేతల్లో లేనేలేదు.

ఈవిషయం బాబుకు తెలుసు. కానీ, ఇప్పుడు అసెంబ్లీలో తనతోబాటు కూర్చోవల్సిన ఎంఎల్‌ఏలు పుర్రెకోబుద్ధి ప్రదర్శించకపోరు. ఐదేళ్లూ తను నంది అంటే నంది అనరు. ఈ ఐదేళ్లూ గోళ్లుగిల్లుకుని కూర్చోలేం అని ఎదురు తిరగరని నమ్మలేం. ఏపీ అసెంబ్లీని చాలావరకు అదుపు తప్పేలా తనే పలుదఫాలు చేసి ప్రతిపక్షాన్ని హీనపరిచానని జబ్బలు చరుచుకోవడం 175 మంది ఎంఎల్‌ఏలకు గుర్తుంటుంది. ఆనాడు జగన్‌ పలు అంశాలపై సభలో స్పందించిన తీరును ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తన ఎంఎల్‌ఏలు అదేరేంజ్‌లో విరుచుకు పడాలనుకుంటారు. జగన్‌ సర్కారు ప్రజలకు ఏమిచేసినా విమర్శలు గుప్పించేందుకు, తమ వితండవాదాన్ని విన్పించాలని జగన్‌ సర్కారును తప్పులతడకగా సభలో నిరూపించాలనే తహతహ తనమందికి ఉంటుంది. తను చేసిన అవినీతి పాలన కారణంగా అడ్డంపడాల్సిన పరిస్థితిలో ఉన్నానని చంద్రబాబు ఈసరికే గ్రహించేసారు. పదేళ్ల ప్రతి పక్షనేతగా రాణించాను. కానీ, ఈసారి ప్రతిపక్షనేతగా ఎలాసభలో నెట్టుకుపోవాలో అని బాబుకు సన్నపాటి వణుకు అంటిపెట్టుకుని ఉంది. 2004లో గెలవలేననుకున్నప్పుడు ఊహించని విధంగా గెలుపు గుర్రమెక్కాను. దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాను.

జనాలను కోడిఈకల్లా  చూసాను. ఆనాడు వైయస్‌ సీఎంగా జనాల హృదయాల్లో చోటు చేసుకునేలా పాలించాడు. ఆతర్వాత రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి తనంత ఘోరంగా పాలనలో లేనేలేరు. అనవసరంగా అన్నింటా చేతులు పెట్టి అభాసు అయ్యాను. జనాలను డబ్బుతో కొనాలని దిక్కుమాలిన పోల్‌మేనేజ్‌మెంట్‌ను నమ్మి ఈరోజు 23మందితో బిక్కుబిక్కుమనాల్సి వచ్చింది అని చంద్రబాబు అనుక్షణం మానసికవేదనలో కృంగుతున్నారు. ఇక అసెంబ్లీలో తను ఒకటంటే జగన్‌ అండ్‌కో పది అనడానికి దండిగా తన తప్పుల అవినీతి పట్టిక ఏకరువు పెడతారు. కాదని, తనేమి తప్పుచేయలేదని వాదనకు దిగినా, స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన, సభ జరగకుండా అరిచిగీపెట్టినా సీబీఐ విచారణకు ఆదేశించడంలో జగన్‌ ఒక్కక్షణం తాత్సారం చేయడు. తనను అనుక్షణం ఎత్తుకునే పచ్చమీడియా సయితం పచ్చ రాతలతో కాపాడలేని పాలకుడుగా జనాలలో హీనపడడం ఖాయం, అని బాబు ఓడిననాటి నుంచి ఇదేతీరులో ఉన్నారు. బయటికి మాత్రం ఓటమి మనకి కొత్తకాదు. జనం కోసం అహర్శిశలు పనిచేయడమే ధ్యేయంగా అలవాటైన పార్టీ టీడీపీ అని చెప్పడం చెబుతున్నారు. కానీ, పార్టీ బక్కచిక్కిపోయిన సంఖ్యాబలంతో అసెంబ్లీలో బిక్కుబిక్కుమనాల్సిందే.

టీడీపీలో పార్టీ ఓటమి నుంచి చంద్రబాబుపై పార్టీ  శ్రేణుల్లో పెదాలు విరుపులు ఉన్నాయి. ఐదేళ్లూ దుర్మార్గపు పాలనకు సాక్షాత్తు చంద్రన్న ఒడిగట్టారు. మాలోకం కొడుకు లోకేష్‌ను, ఏమి మాట్లాడుతాడో తెలియని బామ్మర్ధి బాలకృష్ణలను జనాలపై రుద్దారు. ఈ ఇద్దరూ నిత్యం సోషల్‌ మీడియాలో మెరుపులు మెరిపిస్తూ జనాలకు కావాల్సిన వినోదాన్ని టన్నులకొద్దీ పంచారు. ఆ ఇద్దరికంటే నేనేమి తక్కువ అన్నట్లు బాబు కూడా ఆ ఇద్దరిని మించిపోయి జనాల్లో జనాలను కించపరిచేలా ప్రసంగించడంతో అంతా ఒకే తాను ముక్కలే అన్నట్లుగా జనాలు నొసలు నొక్కుకున్నారు. పలువురు మంత్రులు, ఎంఎల్‌ఏలు అధికార్లపై, జనాలపై రెచ్చిపోవడాలు ఇలాంటివి  ఓటర్ల మస్థిష్కంలో బాబు సర్కారు తీరు ఏమిటి ఇలా ఉంది అని ఒకటి పదిసార్లు అనుకునేలా చేసాయి. అన్నింటికంటే  అన్నిశాఖల్లో  అందినకాడికి దోచుకో అన్నట్లు అధికారపార్టీ కబందహస్తాలతో జనాల సాక్షిగా దోచుకోవడం పార్టీకి, బాబుకు పెద్ద మైనస్‌ అయిపోయింది.

ప్రజల్లో బాగా చెడ్డ అయిపోతున్నాం అని సీనియర్లు చెప్పడానికి వీలులేదన్నట్లు బాబు అహంకారంతో కూడిన తీరు ఉండేది. సాక్షాత్తు బాబే అవినీతిని ప్రోత్సహించడం, పార్టీలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా అన్నిశాఖల ఖజానాలు చేతికి చిక్కిపోయాయి. విభజనలో బక్కచిక్కిన ఏపీ బాబుపాలనతో మరింత చిక్కిపోయి ఆర్ధికంగా శల్యమైపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఏశాఖ గురించి చర్చవచ్చినా అందులో గతపాలకులు ఏ మేరకు దోచుకున్నారో అనేది తీగలాగకుండానే డొంకలు కదలిపోతాయి. అందుకు ప్రభలకారకుడైన చంద్రన్న అసెంబ్లీలో జవాబుదారిగా పట్టులోపిట్టలా, ప్రతిపక్షనేతగా దొరు  కుతారు. బాబు మాటకారి కాదు. తప్పించుకునే తీరులో సాగేరకం కాదు. అడ్డుగోలుగా వాదనలతో,అబద్ధాన్ని నిజం చేయాలనుకునే మహాసీనియర్‌. ఇలా పార్టీలో అనేకానేక మందిలో బాబు తీరుపై పెదవి విరుస్తున్నారు.


ఇక పార్టీలో సీనియర్‌ నేతలు కూడా పార్టీ ఓడిన మరుక్షణం తను నైతిక బాధ్యత వహిస్తూ బాబు రాజీనామా చేసి ఉంటే బావుండేది అని ఆశించారు. అలా చేసి ఉంటే బాబుతో పీడింపబడ్డ ప్రజల్లో జాలిలేకపోయినా పార్టీ క్యాడర్‌లో ఉండేది. బాబే పార్టీని నడపాలి అని అదో వారమో పదిరోజులో క్యాడర్‌ డిమాండ్‌ నడిచేది. బాబు ఏనాడు ఎంత పరాభవం ఎదురైనా పార్టీ చూరుపట్టుకుని వేలాడడం  ఆయన నైజం. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత రాహూల్‌గాంధీ, మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌, దేవెగౌడ్‌లతో బాటు మరికొంత మంది రాజీనామా తాటాకుచప్పుళ్లు చెడామడా చేసారు. అన్ని పార్టీలకంటే అత్యంత ధారుణంగా ఓటమిపాలయి కూడా బాబు ఓటమిని ఇంటిపట్టునే ముసుగుతన్నేసి జీర్ణించుకున్నారు.

ఓడామని దిగులు పట్టిపీడిస్తున్నా ఏతప్పు చేయలేదు అని పచ్చమీడియా నూరిపోత డైలాగులు వల్లిస్తున్నారు. ఇదంతా క్యాడర్‌కు మింగుడు పడడంలేదు. రేపు స్థానిక ఎన్నికలు ఎలా ఉంటాయి? పార్టీ ఇప్పటిలో తేరుకునేలా లేదు. ఓడినోళ్లకు కాళ్లూచేతులు కూడదీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. అసెంబ్లీలో చండ్రనిప్పు కానున్న జగన్‌ను ఎదుర్కొనేందుకు బాబుకు కేసులు భయం. పాలనలో చేసిన అవకతవలు, అక్రమంగా దోచుకున్న వేలకోట్లు నోరు మెదపనీయవు. బాబు ప్రతిపక్షనాయకుడుగా వదులుకుంటే మరోలా ఉండేది. ప్రతిపక్షనేత పదవిని ఏమాత్రం వదులుకోలేని జాఢ్యం బాబు చేసిన అక్రమాల్లో అసెంబ్లీలో మహాదోషిని చేస్తాయి అని టీడీపీ సీనియర్లు, రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

జగన్‌ పాలనను విమర్శలు చేయకుండా బాబు కట్టడి ఆరంభించారు. కానీ,  ఎంతకాలం ఆయన తనమందిని నిలువరించగలరు? వారు ఏదోరోజు ధిక్కరించడంలో వెనుకాడరు. తిమ్మినిబమ్మిని చేసే రాతలకు అలవాటైన బాబు పచ్చ మీడియాను నిలువరించడం బాబుకు సాధ్యంకానిదే. పచ్చ మీడియా అటకబుర్లకో, లేనివి ఆపాదించే  రాతలకు పక్కా జవాబు దారి చంద్రన్నే అవుతారు. పోలవరంలో బాబు ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టర్లను తొలగించేసి, కొత్తవారికి జగన్‌ ఇస్తే అందులో జగన్‌ అండ్‌కో మహామేత మేసారని కలాలు ఝళిపించేవరకు పచ్చమీడియా బాబు అడ్డంపడ్డా ఆగదు. జగన్‌ స్పందించి మీకే పంపుతాను ఫైలు చూసుకోండి. ఇలా లేనివి రాసినందుకు పదండి కోర్టుకు అని కోర్టు గుమ్మం తొక్కించేవరకు నిద్రపోరు.

పైగా, పోలవరంకు కేంద్రం ఇచ్చిందెంత? బాబు హయాంలో ఎంతతినేసారు? ఏమేరకు బాబు అండ్‌ సన్‌ బుక్కారు అనేవి కూడా బహిర్గతం చేస్తారు. ఇవన్నీ చంద్రన్న ఆయన మంత్రుల కళ్లముందు సిన్మారీళ్లలా తిరుగాడుతున్నాయి. ఇన్ని ఒడిదుడుకులతో చంద్రన్న ప్రతిపక్షంలో కూర్చుని చోద్యం చూస్తారా? లేక ఏదయితే అదే అయ్యిందని విరుచుకు పడతారన్నది రానున్న కాలమే నిర్ణయిస్తుంది.

-యర్నాగుల సుధాకరరావు

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు